- ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు
దౌల్తాబాద్ (మెదక్) : ఆ పాఠశాల ప్రిన్సిపాల్ ఎవరికీ చెప్పా పెట్టకుండా గదులకు తాళాలు వేసుకుని పరారయ్యాడు. విద్యార్థులను తీసుకెళ్లేందుకు నిత్యం వెళ్లే బస్సులు కదల్లేదు. బడికి వెళ్దామని వచ్చిన విద్యార్థులు గేటు తాళం తెరుచుకోకపోవడంతో వెనుతిరిగిపోయారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆందోళనకు గురౌతున్నారు. దౌల్తాబాద్ మండలంలో ఓ ప్రైవేటు పాఠశాల మూతపడడంతో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వివరాల్లోకి వెళితే.. మెదక్ జిల్లా దౌల్తాబాద్ మండల పరిధిలోని శేరిపల్లిబందారం శివారులోని మొండిచింత ప్రాంతంలో గత ఐదేళ్లుగా టెక్నో గురుకుల్ ఇంగ్లీషు మీడియం ప్రైవేటు పాఠశాల కొనసాగుతుంది.
గత రెండేళ్లుగా కేరళకు చెందిన సురేందర్ అనే వ్యక్తి ప్రిన్సిపాల్‌గా కొనసాగుతూ పాఠశాలను నిర్వహిస్తున్నారు. గతేడాది పాఠశాలలో ఎల్‌కేజీ నుంచి 10వ తరగతి వరకు 348 మంది విద్యార్థులు చదువుకున్నారు. ఈ విద్యా సంవత్సరం కూడా తరగతులు ప్రారంభించారు. ఈ యేడు దాదాపు 250కి పైగా విద్యార్థులున్నారు. యూనిఫామ్లు, పుస్తకాలు కూడా విక్రయించారు. కాగా జూన్ మాసాంతం వరకు పాఠశాలను నిర్వహించిన సదరు ప్రిన్సిపల్ జూలై 1న (శుక్రవారం) పాఠశాలకు సెలవు ప్రకటించారు. రంజాన్ మాసం సందర్భంగా సెలవు ఇచ్చారని అందరూ భావించారు. కానీ శనివారం కూడా పాఠశాల తెరుచుకోలేదు. విద్యార్థులను గ్రామాల నుంచే తెచ్చేబస్సులు కూడా కదల్లేదు.
స్వతహాగా పాఠశాలకు వచ్చే విద్యార్థులు గేటు తాళాలు తెరుచుకోకపోవడంతో వెనుదిరిగారు. ఆరా తీస్తే.. ఆర్థిక ఇబ్బందులతో పాఠశాల ప్రిన్సిపల్ సురేందర్ పరారయ్యారని తెలిసింది. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై దౌల్తాబాద్ మండల విద్యాధికారి నర్సమ్మను వివరణ కోరగా.. మొండిచింతలోని టెక్నో గురుకుల్ పాఠశాల రెండు రోజులుగా తెరుచుకోని విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. శనివారం విద్యార్థుల తల్లిదండ్రులు కొందరు తమను సంప్రదించారని, విషయాన్ని ఉన్నతాధికారుల సమాచారం అందించినట్లు ఆమె వివరించారు.
పరారైన ప్రిన్సిపాల్.. 2 రోజులుగా తెరుచుకోని స్కూల్
Published Sun, Jul 3 2016 4:02 PM | Last Updated on Sat, Aug 25 2018 6:06 PM
Advertisement
Advertisement