దివంగత సీఎం వైఎస్‌ఆర్ హయాంలో సాగునీటికి ప్రాధాన్యమివ్వడంతో ప్రాజెక్టుల రూపకల్పన, పురోగతి సాధ్యమైందని వైఎస్‌ఆర్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు.
వైఎస్‌ఆర్ హయాంలోనే ప్రాజెక్టులకు ప్రాధాన్యం
Published Mon, Jan 9 2017 1:03 AM | Last Updated on Sat, Jul 7 2018 3:19 PM
- వైఎస్‌ఆర్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి
పాణ్యం : దివంగత సీఎం వైఎస్‌ఆర్ హయాంలో సాగునీటికి ప్రాధాన్యమివ్వడంతో ప్రాజెక్టుల రూపకల్పన, పురోగతి సాధ్యమైందని వైఎస్‌ఆర్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని గోరుకల్లు రిజర్వాయర్‌ను వారు పరిశీలించారు. అనంతరం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైఎస్‌ఆర్ పాలనలో పోలవరం, పులిచింతల, హంద్రీనీవా ,గాలేరు నగరి, గండికోట, వామికొండ రిజర్వాయర్, సర్వరాయ సాగర్, ముచ్చుమర్రి లిఫ్ట్, పైడిపాలెం లిఫ్ట్ వంటి ప్రాజెక్టులు పురోగతి సాధించాయన్నారు. అలాగే ప్రాజెక్టులకు నిధులు కేటాయించి పనుల్లో వేగం పెంచారని వివరించారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పనులను వైఎస్ 90 శాతం పూర్తి చేశారని, మిగిలిన దాన్ని పూర్తి చేసి మేమే చేశామని టీడీపీ నేతలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఎన్టీఆర్ కాలంలో గాలేరి నగరి, తెలుగుగంగ, హంద్రీనీవాలకు ప్రణాళికలు వేసినప్పటికీ వైఎస్ హయాంలోనే పురోగతి సాధించిన విషయం ప్రస్తుత పాలకులు తెలుసుకోవాలని సూచించారు. త్వరలో ప్రారంభం కానున్న పైడిపాలెం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, డ్యామ్, లిఫ్ట్, తొమ్మిది పంపులు, సబ్ స్టేషన్, కార్యాయలం సహా ఇవన్నీ వైఎస్ హయాంలో నిర్మాణాలు జరిగాయన్నారు. ప్రస్తుతం అధికార పార్టీ నాయకులకే ప్రాజెక్టుల కాంట్రాక్టులిచ్చి నిర్మాణ వ్యయం పెంచి దోచుకుంటున్నారని ఆరోపించారు. అనంతరం గోరుకల్లు రిజర్వాయర్ బాధితులు తమకు నష్టపరిహారం అందలేదని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఆయన మాట్లాడుతూ ఇంత వరకు పరిహారం ఇవ్వక పోవడం దారుణమన్నారు. కార్యక్రమంలో రైతు విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యుడు త్రినాథ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి వంగాల భరత్‌కుమార్‌రెడ్డి, జిల్లా నాయకులు శివరామిరెడ్డి , జయప్రకాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement