
భీమసింగి సుగర్స్, పల్లె సంజీవని
ఆపదలో ఉన్నవారికి ఆయువుపోశారు. అన్నార్తుల ఆకలి తీర్చారు. జలయ జ్ఞంతో ప్రాజెక్టులను పరుగులెత్తించారు. పాడిపంటలకు జీవం పోసి రాష్ట్రాన్ని సుభిక్షం చేశారు. సంక్షేమాన్ని జనానికి చేరువచేశారు. మగ్రాభివృద్ధి అంటే ఏమిటో రుచిచూపించారు. అన్ని వర్గాలకూ ఆసరాగా నిలిచి అందరికీ దేవుడయ్యారు. ఖరీదైన వైద్యాన్ని పేదలకు ఉచితంగా అందించారు. పల్లెలకే ఆస్పత్రులు తరలివచ్చే ప్రక్రియను జయవంతం చేశారు. పేద విద్యార్థులకు ఉన్నత చదువు ఉచితంగా అందించారు. ఆపదలో ఆదుకునేందుకు 108 ప్రవేశపెట్టారు. ఆయన పాలనా కాలం స్వర్ణయుగంగా మార్చారు. అంతేనా... దేశంలో అన్ని రాష్ట్రాలకూ ఆదర్శప్రాయుడిగా నిలిచారు. ఆయనే డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి. ఆయన భౌతికంగా దూరమై దశాబ్దం గడిచినా ఇంకా జనం మదిలోనే ఉన్నారు.
సాక్షి , విజయనగరం : రామరాజ్యం అంటే వినడమే తప్ప చూసింది లేదు. కానీ రాజన్నరాజ్యాన్ని ఇప్పటితరంవారంతా చూశారు. ఆయన పాలనలో ఎంతో మంది లబ్ధి పొందారు. అన్ని వర్గాలవారికీ ఏదో రూపంలో సాయం అందించారు. ఆయన పాలనా కాలాన్ని ఇప్పటికీ స్వర్ణయుగంగానే భావిస్తుంటారు. అలాంటి గొప్ప పాలకుడు... మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిని పావురాలగుట్ట మింగేసిందని తెలిసి జిల్లాలో 17 మంది తనువు చాలించారు. ఆనాడు ఉబికిన కన్నీటి ఉప్పెన తడి నేటికీ ఆరలేదు. తన తండ్రిపై అంతటి ప్రేమాభిమానాల ను పెంచుకున్న కుటుంబాలను వైఎస్ తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 2011, మార్చి, మే నెలాఖరులో ఓదార్పు యాత్ర నిర్వహించి ఓదా ర్చారు. నేడు సీఎం అయి తన తండ్రి వైఎస్‌ఆర్ ఆశయ సాధనకు జగన్ పాటుపడుతున్నారు. నేడు ఆ మహా నాయకుడి 70వ జయంతి. జిల్లాలో ఆయన హయాంలో జరిగిన అభివృద్ధి చిరస్మరణీయం. ఆయన పథకాలతో లబ్ధిపొందినవారి జీవితాలు ఎందరికో సాక్షీభూతం.
ప్రజాప్రస్థానంతో చేరువ
మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 2003లో రాష్ట్రంలో చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర జిల్లాలో ఓ చరిత్ర సృష్టించింది. నాడు ఆయన జిల్లాలో పర్యటించి ప్రతి ఒక్కరిని పలకరించా రు. జనం గుండెతట్టి వారి బాధలు తెలుసుకున్నారు. ముఖ్యమంత్రిగా తరతమ భేదాలు చూడకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించారు. అందుకే ఆయన్ను జనం తమ గుండెల్లో గుడి కట్టుకుని నేటికీ పూజిస్తున్నారు. ఆయన హయాంలో అడిగిన వారందరికీ ఫీజులు, స్కాలర్ షిప్పులూ అందజేశారు. అప్పట్లో ఎంత మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నా వారికి ఫీజులు చెల్లించేవారు. వారి పేరున కళాశాలల యాజామాన్యాల ఖాతాల కు ఆ డబ్బులు చేరేవి. అలా 2009 నుండి 2014 సంవత్సరాలకు సంబంధించి స్కాలర్‌షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందినవారు 2లక్షల98 వేల మంది విద్యార్థులు లబ్ధి పొందారు. ఇందుకోసం రూ.318 కోట్లను వైఎస్ ప్రభుత్వం వెచ్చించింది.
విజయనగరంలో యూత్ హాస్టల్ ఆయన చలవే...
విజయనగరం జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ దగ్గరలోని కనపాకలో యూత్ హాస్టల్ భవనాన్ని వైఎస్ నిర్మించారు. పట్టణానికి శాశ్వతంగా తాగునీటి సమస్య పరిష్కరించి... నిరంతరం జనానికి నీరందించేందుకు వీలుగా నిర్మించతలపెట్టిన తారకరామతీర్థసాగర్‌కు బడ్జెట్ భారీగానే కేటాయించారు. 2004 నుంచి 2009 వరకు చీపురుపల్లి నియోజకవర్గంలో రూ. 84 కోట్ల రూపాయలతో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇందిరమ్మ, సుజలధార తాగునీటి పధకాన్ని నియోజకవర్గానికి మంజూరు చేశారు. చీపురుపల్లిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాల, టీటీడీ కల్యాణ మండపాలు మంజూరయ్యాయి. వేపాడ మండలంలో విజయరామసాగర్‌ను మినీరిజర్వాయర్‌కు వైఎస్సార్ నిధులు మంజూరు చేశారు. సాలూరు నియోజకవర్గంలోని మెం టాడ, పాచిపెంట, సాలూరు మండలాల్లోని గ్రామాలకు రహదా రులు, వంతెనల నిర్మాణాలు జరిగాయి.
ఆపదలో ఆదుకునే అపరసంజీవిని
జిల్లాలో ఏ పల్లెలోనైనా ఆపద సంభవిస్తే వెంటనే అక్కడివారిని ఆస్పత్రికి ఉచితంగా తరలించేందుకు ప్రవేశపెట్టిన 108 వాహనాలను పెద్ద సంఖ్యలో సమకూర్చారు. నాడు ప్రతి రెండు మండలాలకు ఒక వాహనం ఉండటంతో ఫోన్ చేసిన క్షణంలోనే వాహనాలు ప్రత్యక్షమయ్యేవి. ఇకదీర్ఘకాలిక వ్యాధులకు ఉచితంగా తనిఖీలు నిర్వహించడమే గాకుండా మందులు కూడా అందించేందుకు వీలుగా పల్లెలకే 104 వాహనాలను పంపించే ఏర్పాటు చేశారు. దీనివల్ల లక్షలాదిమంది లబ్ధి పొందారు. నిరుపేదలు చిన్నపాటి రోగానికి వైద్యం పొందలేక మరణాన్ని ఆశ్రయిస్తుంటే ఆరోగ్యశ్రీతో ఆదుకుని లక్షల విలువైన కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందించే ఏర్పాటు చేశా రు. దానివల్ల జిల్లాలో లక్షలాది మంది లబ్ధిపొంది ఈ రోజు సంపూ ర్ణ ఆరోగ్యంతో జీవిస్తున్నారు.
అడగకుండానే అన్నీ ఇచ్చి...
నాడు నష్టాల్లో కూరుకుపోయిన రైతాంగానికి రుణమాఫీ చేసిన ఘనత కూడా రాజశేఖరరెడ్డికే దక్కుతుంది. ఆయన హయాంలో జిల్లాలోని వేలాదిమంది రైతులకు రుణమాఫీ జరిగి ప్రతి ఇంటా ఆనందాన్ని విరబూయించారు. కిలో రెండు రూపాయలకే బియ్యాన్ని అందించి పేదలకు మేలు చేశారు. కేవలం రూ. 75లు మాత్రమే ఉన్న సామాజిక పింఛన్‌ను రూ. 200కు పెంచిన అవసానదశలో ఉన్న వృద్ధులు, దివ్యాంగులకు బతుకుపై భరోసా కల్పించారు.
ఇవన్నీ జిల్లావాసులు మరచిపోలేదు. అందుకే ఆనాటి స్వర్ణయుగం మళ్లీ వైఎస్ తనయుడితో వస్తుందన్న నమ్మకంతో జగన్‌మోహన్‌రెడ్డి విజయానికి ఎంతగానో పాటుపడ్డారు. జిల్లాలోని తొమ్మిది శాసనసభ, ఎంపీ స్థానాన్ని వైఎస్సార్‌సీపీకి కట్టబెట్టారు. ఆయన సైతం తండ్రిబాటలో నడుస్తూ సంక్షేమానికి పాటుపడుతున్నారు. వైఎస్ జయంతిని రైతు దినోత్సవంగా జరపాలని నిర్ణయించారు. అంతేగాకుండా ఆయన పేరుతో వినూత్నంగా పింఛన్ పథకాన్ని ప్రారంభించనున్నారు. వైఎస్ ఆశయ సాధనకు ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టనున్నారు.
అపరభగీరథుడు వైఎస్
మహానేత రాజశేఖరరెడ్డి జిల్లాలో అనేక సాగునీటి ప్రాజెక్టులు కట్టించి అపరభగీరథునిగా గుర్తింపు పొందారు. ముఖ్యంగా గరుగుబిల్లి మండలం తోటపల్లి వద్ద నిర్మించిన ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసి ఆయన హయాంలోనే 90శాతం పనులు పూర్తి చేయించారు. అంతేగాకుండా... బొబ్బిలి, తెర్లాం, బాడంగి మండలాలను కలుపుకుంటూ తోటపల్లి సాగునీటి కాలువ ఏర్పాటైంది. గజపతినగరంలో తోటపల్లి చానల్ ద్వారా సుమారు 3వేల ఎకరాలకు పైలాన్ ప్రారంభోత్సవం చేశారు. కొమరాడ మండలం రాజ్యలక్ష్మీపురం వద్ద జంఝావతి ప్రాజెక్టు ఆస్ట్రియా సాంకేతిక పరిజ్ఞానంతో ఒడిశాతో ఉన్న సరిహద్దు వివాదంతో సంబంధం లేకుండా రబ్బర్ డ్యామ్‌ను రూ. 6 కోట్లతో నిర్మించి దేశంలోనే సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. ఆ డ్యామ్ వల్ల 3వేల ఎకరాలకు సాగునీటిని అందించారు.
పార్వతీపురం మండలం అడారిగెడ్డ నిర్మాణానికి కూడా నిధులు కేటాయించారు. జలయజ్ఞంలో భాగంగానే పెద్దగెడ్డ రిజర్వాయర్ నిర్మించారు. తాటిపూడి జలాశయాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది. వెంగళరాయ సాగర్, ఆండ్ర రిజర్వాయర్ ఆధునికీకరణకు నిధులు విడుదల చేసి జిల్లాను సస్యశ్యామలంగా మార్చేందుకు తనవంతు కృషి చేశారు. మక్కువ మండలంలో సురాపాడు ప్రాజెక్టు నిర్మించార. నెల్లిమర్ల నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోగల పంట పొలాలకు సాగునీటిని అందించేందుకు తారకరామతీర్థసాగర్ సాగునీటి ప్రాజెక్టును మంజూరు చేశారు. దీని కోసం 2007లోనే సుమారు రూ. 187 కోట్లను విడుదల చేశారు. నెల్లిమర్ల పట్టణంతో పాటు గుర్ల, గరివిడి మండలాలకు తాగునీటిని అందించేందుకు రామతీర్థం మంచినీటి పధకాన్ని వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించారు.
చక్కెర కర్మాగారానికి కొత్త ఊపిరి
జిల్లాలోని భీమసింగిలో గల ఏకైక సహకార చక్కెర కర్మాగారం మూతపడటంతో దానిపై ఆధారపడిన వందలాది కార్మికుల బతుకులు దుర్భరంగా మారాయి. చెరకు పండించే రైతులకు భరోసా లేకుండా పోయింది. పాదయాత్రగా జిల్లాకు వచ్చిన మహానేత దాని పరిస్థితిని స్వయంగా పరిశీలించి దానిని తెరిపించేందుకు హామీ ఇచ్చారు. ఆ మాటకు కట్టుబడి ఆయన ముఖ్యమంత్రి కాగానే పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసి కర్మాగారాన్ని తెరిపించి మళ్లీ కార్మికులు, రైతుల్లో ఆనందాన్ని నింపారు.