మాట్లాడుతున్న స్పీకర్ మధుసూదనాచారి
- నివాళ్లుర్పించిన స్పీకర్, మంత్రి, డిప్యూటీ స్పీకర్
- సిద్దిపేటలో జయశంకర్ కాంస్య విగ్రహ ఆవిష్కరణ
సిద్దిపేట జోన్: తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాత, మార్గనిర్దేశకుడు ప్రొఫెసర్ జయశంకర్ అని, ఆయన ఉద్యమ సారధి కేసీఆర్‌కు వెన్నుదన్నుగా నిలిచారని రాష్ట్ర శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. శనివారం ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ముస్తాబాద్ చౌరస్తా వద్ద నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని మంత్రి హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో స్పీకర్ మాట్లాడుతూ దేశంలో జాతిని ప్రభావితం చేయగల వ్యక్తుల్లో జయశంకర్ రెండవ వారన్నారు. చరిత్రలో జాతిని ప్రభావితం చేసిన వ్యక్తులు ఇద్దరేనని వారిలో ఒకరు జాతిపిత మహాత్మాగాంధీ కాగా మరొకరు ప్రొఫెసర్ జయశంకర్ అన్నారు. సాధారణ జీవితం గడిపిన జయశంకర్ సార్ నిరాంబడరుడు, గొప్ప మేధావి అని ఆయనతో తనకు సాన్నిహిత్యం ఉండేదన్నారు. గురువుగా, మార్గదర్శకునిగా విలక్షణమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి జయశంకర్ అని స్పీకర్ కొనియాడారు.
ఉద్యమంలో నిరాశానిస్పృహలతో ఉన్న సమయంలో ఉద్యమ సారధి కేసీఆర్ ధైర్యం నూరిపోసి ముందుకు నడిపించారన్నారు. రాష్ట్రాన్ని సాధించుకోవడం ఎంత ముఖ్యమో బంగారు తెలంగాణ నిర్మించుకోవడం అంతే ముఖ్యమని భవిష్యత్తు ప్రణాళికను రూపొందించరన్నారు. వరంగల్, సిద్దిపేట , ప్రాంతాలకు చెందిన వారు ఎంతో అదృష్టవంతులని జయశంకర్, కేసీఆర్ లాంటి గొప్ప వ్యక్తులు ఈ గడ్డపై జన్మించారన్నారు.
అంతకు ముందు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ ప్రస్తుతం జయశంకర్‌సార్ జీవించి ఉంటే ఎంతో సంతోషించేవారన్నారు. దురదృష్టవశాత్తు ఆయన మన మధ్యలో లేడన్నారు. జయశంకర్ కలలను సాకారం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అదిశగా బంగారు తెలంగాణ నిర్మాణానికి కంకణబద్ధులమై ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ముందుకు సాగుతున్నామన్నారు.
1330 టీఎంసీల గోదావరి , కృష్టా నది జాలాల్లో నీటి వాటాను వాడుకోని తెలంగాణలో కోటి ఎకరాల మాగాణిని సస్యశ్యామలం చేస్తామన్నారు. గత ప్రభుత్వాలు తెలంగాణ అభివృద్ధికి 45 శాతం నిధులు కూడా బడ్జెట్‌లో కేటాయించలేదని గడిచిన రెండేళ్లలో వేలాది కోట్లతో రాష్ట్రం అభివృద్ధివైపు పరుగులు తీస్తోందన్నారు. జయశంకర్ సార్ గుర్తుగా సిద్దిపేటలో నిర్మించిన మినీ స్టేడియానికి ఆయన పేరు పెడుతున్నామన్నారు.
డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సమాజానికి తన జీవితాన్ని అంకితం చేసిన గొప్పవ్యక్తి జయశంకర్‌సార్ అన్నారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, నంది అవార్డు గ్రహీత నందిని సిధారెడ్డి, ఉన్నత విద్యామండలి సభ్యులు పాపయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ అక్తర్ పటేల్ కౌన్సిలర్ మచ్చవేణుగోపాల్‌రెడ్డి, సాకి అనంద్, ప్రవీణ్, దీప్తి నాగరాజు లోక లక్ష్మిరాజం. , ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌రెడ్డి, టీఎన్‌జీవో నాయకులు శ్రీహరి, అశ్వక్, టీపీటీఎప్ రాష్ట్రనాయకులు తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.