వందేళ్ల అద్భుత దర్శనం
♦ ప్రోజెక్టర్ ద్వారా ట్రాన్సిట్ ఆఫ్ మెర్క్యూరీ వీక్షణం
♦ కొండాపూర్ గురుకుల పాఠశాలలో కార్యక్రమం
♦ హాజరైన కలెక్టర్ రోనాల్డ్‌రాస్
కొండాపూర్: వందేళ్లలో 14వ సారి వెలుగుచూసిన ట్రాన్సిట్ ఆఫ్ మెర్క్యూరీ అద్భుతాన్ని కొండాపూర్ గురుకుల విద్యార్థులతో పాటు కలెక్టర్ రోనాల్డ్‌రాస్ సోమవారం వీక్షించారు. గురుకులంలో బ్రైటర్‌మైండ్స్ సమ్మర్ క్యాంప్‌లో భాగంగా ఆ అద్భుతాన్ని వీక్షించేందుకు వీలుగా విద్యార్థులకు ఖగోళ పరిశోధకుడు రఘునందన్‌కుమార్ జర్మనీ, ఇంగ్లాండ్ నుంచి దిగుమతి చేసిన సోలార్‌ఫిల్టర్(సూర్యుడిని చూసే పరికరం)లను అందజేశారు. ఈ సందర్భంగా ఖగోళ పరిశోధకులు మాట్లాడుతూ.. విద్యార్థులకు ట్రాన్సిట్ ఆఫ్ మెర్క్యూరీని చూపించాలనుకు న్నా ఇక్కడి వాతావరణం సహకరించలేదన్నా రు.
అందుకే అమెరికాకు చెందిన నాసా సంస్థ పంపిన ఉపగ్రహం(సోలార్ డైనమిక్ అబ్జర్వరీ) సహాయంతో ప్రొజెక్టర్ ద్వారా ప్రత్యక్షంగా చూ పించామని చెప్పారు. ఇలాంటి సంఘటనలు ఖగోళశాస్త్రంలో వెలుగుచూడటం చాలా అరుదన్నారు. గతంలో ఇలాంటి సంఘటనలు జరిగినా భారతదేశంలో వీక్షించే అవకాశం మాత్రం లభించలేదని తెలిపారు. ఈ నెల 22వ తేదిన ఖగోళశాస్త్రంలో మరొక అద్భుత సంఘటన జరుగుతుందని పేర్కొన్నారు. అంగారకు డు, భూమి, సూర్యుడు ఒకే కక్ష్యలోకి వస్తాయన్నారు. విద్యార్థుల వీక్షణానికి కృషి చేసిన కలెక్టర్, యూనిసెఫ్ సంస్థకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్రంలో ప్లానిటోరియంలు లేకపోవడంతో ఖగోళశాస్త్రం గురించి తెలుసుకోవడం విద్యార్థులకు ఇబ్బందిగా మారిందని, ప్లానిటోరియం ఏర్పాటుకు ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని కలెక్టర్ తెలిపారు. అనంతరం విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి వారు చెప్పిన సమాధానాలపై సంతృప్తి చెందారు. ప్రతిభను వెలికి తీయడానికి ఇలాంటి శిక్షణ కేంద్రాలు ఉపయోగపడతాయని కితాబు ఇచ్చారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ కృష్ణ ఆదిత్య, కళాశాల ప్రిన్సిపల్ గోదావరి, తహసీల్దార్ లావణ్య, పీడీ గణపతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.