‘‘సైన్స్... పది కొత్త సమస్యలను సృష్టించిగానీ.. ఒకదానికి పరిష్కారం కనుక్కోదు’’
ప్రఖ్యాత ఇంగ్లీష్ కవి జార్జ్ బెర్నాడ్ షా మాటలివి. సైన్స్ ముందుకు పురోగమిస్తున్న కొద్దీ కొత్త కొత్త సవాళ్లు, సంక్లిష్టమైన సమస్యలు ఎదురవుతూంటాయని చెప్పడం ఆయన ఉద్దేశం. జ్ఞానాన్ని పెంచుకోవడం నిత్యం జరుగుతూనే ఉంటుందని, ఒక సమస్యకు దొరికే పరిష్కారం మరిన్ని కొత్త ప్రశ్నలు, సమస్యలకు దారి తీసే అవకాశం ఉందని కూడా బెర్నార్డ్ షా అనుకుని ఉంటాడు.
ఇంతకీ విషయం ఏమిటంటే.. విశాల విశ్వంలో ఓ మూలన ఓ పే...ద్ధ పేలుడు సంభవించిందట. సుదూర గ్రహాలు, పాలపుంతలు, నక్షత్రాలపై కన్నేసేందుకు అమెరికాకు చెందిన నాసా ప్రయోగించిన టెలిస్కోపు ‘హబుల్’ ఈ పేలుడును గుర్తించింది. ఇందులో పెద్దగా విశేషం ఏమీ లేకపోవచ్చు కానీ.. ఈ పేలుడు జరిగిన ప్రాంతంలో ఏ రకమైన ఖగోళ వస్తువూ లేకపోవడమే శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తోంది. సింపుల్‌గా చెప్పాలంటే.. ఏమీ లేని చోట బాంబు పేలుడు జరిగిందన్నమాట. పేలుడు ఎలా జరిగిందన్నది ఇప్పుడు ప్రశ్న?
అంచనాలు తారుమారు...
కొన్నేళ్ల క్రితం ఖగోళ శాస్త్రవేత్తలు అంతరిక్షంలో జరిగే ఓ కొత్త రకం పేలుడు గురించి ప్రకటించారు. లూమినస్ ఫాస్ట్ బ్లూ ఆప్టికల్ ట్రాన్సియట్... క్లుప్తంగా ఎల్‌ఎఫ్‌బోట్ అని పిలుస్తారు దీన్ని. పొడవాటి, సంక్లిష్టమైన పేరును కాసేపు మరచిపోండి. ఈ పేలుడులో భాగంగా కొన్ని రోజుల పాటు ప్రకాశవంతమైన నీలి రంగు కనిపిస్తుందని మాత్రమే గుర్తుపెట్టుకుందాం. 2016లో ఇలాంటి పేలుడు ఒకదాన్ని తొలిసారి గుర్తించగా.. ఆ తరువాత దాదాపుగా చూడలేదు. అందుబాటులో ఉన్న కొద్దిపాటి సమచారంతోనే ఈ పేలుళ్లు ఎలా పుట్టిఉంటాయో అంచనా కట్టేందుకు ప్రయత్నం చేశారు.
రకరకాల అంచనాల్లో కోర్-కొలాప్స్ సూపర్ నోవాకు మద్దతు పెరిగింది. ఎక్కువయ్యారు. ఇంధనమంతా ఖర్చయిపోయిన నక్షత్రం పేలిపోతే సూపర్‌నోవా అంటారని మనకు తెలుసు. అయితే ఈ క్రమంలోనే పెరిగిపోయే గురుత్వ శక్తి కారణంగా ఈ నక్షత్రం తాలకూ కోర్ కూడా తనలో తాను కుప్పకూలిపోతే దాన్ని కోర్-కొలాప్స్ సూపర్‌నోవా అని పిలుస్తారు. కానీ... ఈ ఏడాది ఏప్రిల్ పదిన ఈ అంచనాలన్నీ తల్లకిందులయ్యాయి.
జ్వికీ ట్రాన్సియంట్ ఫెసిలిటీ (జెడ్‌టీఎఫ్) ఎల్‌ఎఫ్‌బోట్ పేలుడును గుర్తించింది. ‘ఏటీ2023ఎఫ్‌హెచ్‌ఎన్’ అని నామకరణం చేశారు. ‘ఫించ్’ అని ముద్దుగా పిలుచుకోవడం మొదలుపెట్టారు. ప్రకాశవంతమైన నీలి రంగులో కాంతి కనిపించింది. కొన్ని రోజుల తరువాత క్రమేపీ మాయమైంది. ఉష్ణోగ్రతలు కూడా గరిష్టంగా 20000 డిగ్రీ సెల్సియస్ వరకూ ఉన్నట్లు తెలిసింది. అన్నీ సాధారణమే అనుకున్నారు శాస్త్రవేత్తలు. కానీ... హబుల్ టెలిస్కోపును ఈ పేలుడు సంభవించిన వైపు తిప్పినప్పుడు అసలు విషయం తెలిసింది.
ఇది సాధారణ ఎల్‌ఎఫ్‌బోట్ కాదని అర్థమైంది. అప్పటివరూ గుర్తించి అన్ని ఎల్‌ఎఫ్‌బోట్‌లు పాలపుంతల్లోపల సంభవించాయి. అది కూడా ఓ నక్షత్రం తయారవుతున్న సమయంలో జరిగాయి ఈ పేలుళ్లు. ఫించ్ మాత్రం పాలపుంతలో లేదు సరికదా.. ఒంటరిగా అలా తేలియాడుతూ ఉందంతే. పైగా దీనికి దగ్గరలో కూడా ఏ పాలపుంత లేదు. సుమారు 15000 కాంతి సంవత్సరాల దూరంలో మాత్రమే పాలపుంతలున్నాయి. సూపర్‌నోవాల్లో నక్షత్రం చాలా వేగంగా అంతరించిపోతుంది. ఏమీ లేని ప్రాంతంలో దీర్ఘకాలం అలా తేలియాడుతూ ఉండేందుకు అవకాశం లేదు.
ఏమై ఉండవచ్చబ్బా...?
ఏప్రిల్ పదిన గుర్తించి ఎల్‌ఎఫ్‌బోట్ కచ్చితంగా మమ్మల్ని ఆశ్చర్యపరిచిందంటారు ఆష్లే క్రైమ్స్. ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త ఈయనే. ఫించ్ ఘటన తరువాత ఎల్‌ఎఫ్‌బోట్‌లు పాలపుంతల్లో మాత్రమే కాకుండా... సూదూరంగానూ సంభవించగలవని స్పష్టమైంది. బహుశా ఓ భారీ కృష్ణ బిలం నక్షత్రం ఒకదాన్ని ముక్కలుగా చీల్చేయడం వల్ల ఈ ఎల్‌ఎఫ్‌బోట్ పుట్టి ఉండవచ్చునని శాస్త్రవేత్తలు తాజాగా అంచనా వేస్తున్నారు. లేదా రెండు న్యూట్రాన్ స్టార్లు ఢీకొనడం కూడా కారణమై ఉండవచ్చునని అంటున్నారు. ఈ రెండు న్యూట్రాన్ స్టార్లలో ఒకటి భారీగా అయస్కాంతీకృతమైనందైతే (మాగ్నెటార్ అంటారు) సాధారణ సూపర్‌నోవా కంటే వంద రెట్లు ఎక్కువ కాంతి వెలువడుతుందని క్రైమ్స్ చెప్పారు. ఈ విషయంపై కచ్చితమైన అంచనా వేయాలంటే మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉంటుందని చెప్పారు.
అమెరికా, యూరప్, కెనడాలు కలిసికట్టుగా ప్రయోగించిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా పరిశీలించినప్పుడు మరికొన్ని క్లూలు దొరికాయి. దగ్గరలోని పాలపుంత ఔటర్ హాలో (ప్రకాశవంతమైన కాంతి ఉండే ప్రాంతం)లోని నక్షత్రాల గుంపు నుంచి వచ్చి ఉండవచ్చునని తెలుస్తోంది. ఇదే నిజమైతే కృష్ణబిలం ఓ నక్షత్రాన్ని చీల్చేయడం వల్ల ఎల్‌ఎఫ్‌బోట్ ఏర్పడిందన్న సిద్ధాంతానికి బలం చేకూరుతుంది. పరిశోధన వివరాలు రాయల్ అస్ట్రనామికల్ సొసైటీ జర్నల్ ‘మంత్లీ నోటీసెస్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి.
హైలైట్స్....
ఏమిటి?.... శూన్యంలో వినూత్నమైన పేలుడు!
ఎప్పుడు?... ఈ ఏడాది ఏప్రిల్ పదవ తేదీ తొలిసారి గుర్తించారు!
ఎలా?.... నాసా ప్రయోగించిన హబుల్ టెలిస్కోపు ద్వారా...
ఎందుకు జరిగిందీ పేలుడు?.... స్పష్టంగా తెలియదు! తెలుసుకునే ప్రయత్నంలోనే శాస్త్రవేత్తలున్నారు.!
Comments
Please login to add a commentAdd a comment