నిజాంపట్నంలో త్వరలో మెరైన్ పోలీస్‌స్టేషన్
Published Sun, Jul 24 2016 9:27 PM | Last Updated on Mon, Sep 4 2017 6:04 AM
జెట్టీ నిర్మాణం కూడా..
రాష్ట్రంలో 21 మెరైన్ పోలీస్ స్టేషన్‌లు ఉన్నాయి..
మెరైన్ ఐజీ సూర్యప్రకాశరావు
నిజాంపట్నం : రాష్ట్రంలో 21 మెరైన్ పోలీస్ స్టేషన్‌లు ఉన్నాయని మెరైన్ ఐజీ జి.సూర్యప్రకాశరావు తెలిపారు. బొర్రావారిపాలెంలోని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసన శంకరరావు నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐజీ మాట్లాడారు. గతంలో ఐజీ కార్యాలయం హైదరాబాద్‌లో ఉండేదని గత ఏడాది డిసెంబర్‌లో విశాఖపట్నానికి మార్చినట్లు తెలిపారు. మెరైన్ బోట్‌లను నిలిపేందుకు ఫేజ్–1 కింద రాష్ట్రంలో 7 జెట్టీలు మంజూరయ్యాని చెప్పారు. వీటి నిర్మాణం త్వరలో చేపట్టడం జరుగుతుందన్నారు. ఫేజ్–2 కింద మరో 14 జెట్టీలు మంజూరు కావాల్సిఉందని పేర్కొన్నారు. ఫేజ్–1 కింద రాష్ట్రంలో 18 మెరైన్ బోట్లు మంజూరయ్యాయని, ఫేజ్–2 కింద మరో 30 మెరైన్ బోట్లు రావాల్సి ఉందన్నారు. సముద్రంలో 25 కిలోమీటర్ల దూరం వరకూ మెరైన్ సిబ్బంది విధులు నిర్వహిస్తారని తెలిపారు. త్వరలో మచిలీపట్నంలో 250 ఎకరాల స్థలంలో మెరైన్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.త్వరలో నిజాంపట్నంలో మెరైన్ పోలీస్‌స్టేషన్ నిర్మాణం రూ.70 లక్షలతో త్వరలో నిజాంపట్నంలో మెరైన్ స్టేషన్ నిర్మాణాన్ని చేపట్టడం జరుగుతుందని ఐజీ సూర్యప్రకాశరావు తెలిపారు. స్టేషన్ నిర్మాణానికి అవసరమైన 15 సెంట్ల స్థలాన్ని దాతలు ఇచ్చారని చెప్పారు. మెరైన్ బోట్లు ఆగేందుకు నిజాంపట్నంలో రూ.50 లక్షలతో జెట్టీని త్వరలో నిర్మిస్తామని పేర్కొన్నారు. నిజాంపట్నానికి త్వరలో రెండు మెరైన్ బోట్లు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు.
Advertisement