దమ్మపేట, న్యూస్‌లైన్: కోడి పందేల పేరుతో దాడి చేస్తారా..? అంటూ దమ్మపేట ఎస్సై ఎల్లయ్యపై మండలంలోని నాగుపల్లి, సరోజనాపురం, శ్రీరాంపురం, మొండివర్రె గ్రామాల ప్రజలు శనివారం స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని శ్రీరాంపురంలో ఈ నెల 3వ తేదీన అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కోడి పందేలు నిర్వహించాడు. ఈ పందేలకు శ్రీరాంపురం, నాగుపల్లి, సరోజనాపురం, మొండివర్రె గ్రామాలకు చెందిన పలువురు వెళ్లారు. ఈ సమాచారం తెలిసిన దమ్మపేట ఎస్సై ఎల్లయ్య అక్కడికి వెళ్లి ముగ్గుర్ని అదుపులోకి తీసకున్నారు. వారిని పోలీసు పద్ధతిలో మందలించారు. దీంతో భయపడిన వారు మరో 26 మంది పేర్లను చెప్పారు.
ఆ పేర్లను నమోదు చేసుకున్న ఎస్సై వారి ఇళ్లకు వెళ్లి నోటీసులు ఇచ్చారు. వారంతా శనివారం ఆయా గ్రామాల పెద్ద మనుషుల సమక్షంలో స్టేషన్‌కు వచ్చారు. కానీ విచారణ పేరుతో ఎస్సై వారిని తమ ముందే చితకబాదారని ఆయా గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు చిట్టిమాది కేశవరావు, కందిమళ్ల నాగప్రసాద్, వాసం శ్రీను, మద్దిశెట్టి సత్యప్రసాద్, తుర్లపాటి నాగేశ్వరావు, పాకనాటి శ్రీనివాసరావు, ఆంగోత్ సర్వేశ్వరరావులు ఆరోపించారు. పందేలా ని ర్వహకులను వదిలిపెట్టి అమాయకులను తీ వ్రంగా కొట్టడం ఎంత వరకు సమంజసమని పోలీసుల తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఎస్సై తీరుకు నిరసనగా పోలీస్‌స్టేషన్ ఎ దుట పాల్వంచ రహదారిపై గంట పాటు రాస్తారోకో నిర్వహించారు. ఇంత జరుగుతు న్నా ఎస్సై ఎల్లయ్య సంఘటన స్థలానికి రాకపోవడంతో ఆందోళన కారులు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమాచారం అందుకున్న సత్తుపల్లి డీఎస్పీ అశోక్‌కుమార్ సత్తుపల్లి సీఐ వెంకన్నను దమ్మపేటకు పంపించారు.
నాయకులతో సీఐ చర్చలు...
సత్తుపల్లి సీఐ వెంకన్న దమ్మపేట వచ్చి వివిధ పార్టీల నాయకులు జూపల్లి ఉపేంద్రబాబు, పైడి వెంకటేశ్వరరావు, దారా యుగంధర్, దొడ్డా లక్ష్మీనారాయణ, వాసం శ్రీను, తుర్లపాటి నాగేశ్వరరావులతో చర్చలు జరిపారు. ముందుగా అదుపులోకి తీసుకున్న ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేస్తామని, మిగిలిన 26 మందిపై కేసు లేకుండా చూస్తామని, దీనిపై విచారణ జరుపుతామని తెలిపారు. ఈ విషయంపై ఆదివారం నాయకులు సత్తుపల్లి డీఎస్పీతో సమావేశం కావాలని సూచించారు. కోడిపందేల నిర్వహకుడు లక్ష్మణరావుపై కూడా కేసు నమోదు చేయాలని లేకపోతే ముందు అరెస్ట్ చేసిన వారిపై కేసును ఎత్తివేయాలని ఆందోళన కారులు డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఎస్సై ఎల్లయ్య మాట్లాడుతూ తాను ఉద్దేశపూర్వకంగా ఎవరినీ కొట్టలేదని, మందలించే నిమిత్తం కొట్టిన మాట వాస్తవమేనని అన్నారు.
దమ్మపేట ఎస్సై తీరుపై నిరసన
Published Sun, Feb 23 2014 2:23 AM | Last Updated on Sat, Sep 2 2017 3:59 AM
Advertisement
Advertisement