ఐఏఎస్‌కు ఎంపికయ్యానంటూ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని చీరాల పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.
ఒంగోలు(ప్రకాశం): ఐఏఎస్‌కు ఎంపికయ్యానంటూ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని చీరాల పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. చీరాల డీఎస్పీ జయరామరాజు తెలిపిన వివరాలివీ... గుంటూరు జిల్లా క్రోసూరు మండలం యర్రబాలెం గ్రామానికి చెందిన కజ్జా పుల్లారావు(31) ప్రకాశం జిల్లా ఈపూరుపాలేనికి చెందిన మహిళా కానిస్టేబుల్‌ను 2012లో వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్లు బాగానే ఉన్నా తరువాత వారి మధ్య సఖ్యత కొరవడింది. గత కొంతకాలం నుంచి ఐఏఎస్‌కు ఎంపికయ్యాయని, త్వరలో శిక్షణకు వెళ్లబోతున్నానని, చాలామంది ఐఏఎస్‌లు తనకు పరిచయం ఉన్నారని కొందరిని నమ్మించాడు.
కారంచేడు ఎస్సై రాజేష్‌ను కూడా మాయమాటలతో ఇదే విధంగా నమ్మించాడు. ఆ విషయం అక్కడితో పరిమితం కాకుండా ఎస్సై ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేయడం ప్రారంభించాడు. గుంటూరు జిల్లాకు చెందిన చల్లా పూర్ణ చంద్రశేఖర్‌రెడ్డితో పాటు మరికొందరి వద్ద నుంచి రూ.40 లక్షలు బేరం కుదుర్చుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఎస్సై రాజేష్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రహస్యంగా విచారణ చేపట్టారు. అసలు విషయం బయటపడడంతో ఐఏఎస్ నంటూ మోసాలకు పాల్పడుతున్న పుల్లారావును పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.