
అంగన్‌వాడీలో అమానుషం
అనంతపురం జిల్లా పెనుకొండ పట్టణంలోని మారుతీనగర్ అంగన్‌వాడీ కేంద్రంలో అమానుషం చోటు చేసుకుంది. గుక్కపట్టి ఏడుస్తున్న చిన్నారి మూతికి ఆయా వాతపెట్టింది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి.
- చిన్నారి మూతికి వాత పెట్టిన ఆయా
పెనుకొండ : అనంతపురం జిల్లా పెనుకొండ పట్టణంలోని మారుతీనగర్ అంగన్‌వాడీ కేంద్రంలో అమానుషం చోటు చేసుకుంది. గుక్కపట్టి ఏడుస్తున్న చిన్నారి మూతికి ఆయా వాతపెట్టింది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. పట్టణానికి చెందిన అక్కమ్మ, అనిల్ దంపతులు తమ కుమార్తె సాయిదీపిక (4)ను బుధవారం ఉదయం అంగన్‌వాడీ కేంద్రంలో వదిలి ఇటుకల పనికి వెళ్లిపోయారు. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత కుమార్తెకు ముఖం కడిగేందుకు ప్రయత్నించగా బిగ్గరగా ఏడ్చింది. అనుమానం వచ్చి మూతివైపు చూడగా వాత పడిన ఆనవాళ్లు కనిపించాయి. అంగన్‌వాడీ కార్యకర్త తిప్పేబాయిని ప్రశ్నించగా.. తనకేమీ తెలియదని చెప్పారు. ఆయా శకుంతలాబాయిని ప్రశ్నించగా.. పాప ఏడుస్తుంటే నిప్పువేడి చూపిన చాకుతో పెదవికి ముట్టించానని, ఏమీ కాదులే అని సమాధానమిచ్చింది. గురువారం ఉదయం చిన్నారి నొప్పితో విలవిలలాడుతుంటే తల్లిదండ్రుల ద్వారా విషయం తెలుసుకున్న మారుతీనగర్‌వాసులు ఆయాను నిలదీశారు. అదే సమయంలో అక్కడికొచ్చిన ఐసీడీఎస్ సూపర్‌వైజర్ నిర్మలామేరీపై మహిళలు తిరగబడ్డారు. దీంతో సీడీపీఓ ప్రభావతమ్మ ఆదేశాల మేరకు ఆయా శకుంతలాబాయిని విధుల నుంచి తొలగిస్తామని సూపర్‌వైజర్ తెలిపారు.