రవాణా శాఖ సేవలూ ఇకపై ఆన్‌లైన్‌లోనే..
–ఇక ఏజెంట్ల వ్యవస్థకు చెక్
–15 నుంచి షోరూముల్లో రిజిస్ట్రేషన్లు
–వినియోగదారులకు ఊరట
తణుకుః రవాణాశాఖలో సంస్కరణలు తెచ్చేందుకు ఆ శాఖ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఆన్‌లైన్ సేవలను అందిస్తుండగా ఈనెల 15 నుంచి షోరూముల్లోనే శాశ్వత రిజిస్ట్రేషన్లు చేయించుకునేలా కసరత్తు చేస్తున్నారు. రవాణాశాఖ కార్యాలయల్లో రిజిస్ట్రేషన్లకు స్వస్తి పలికేందుకు ఈ విధానం అమలు చేయనున్నారు. ఇప్పటికే జిల్లాలో చాలా కాలంగా తాత్కాలిక రిజిస్ట్రేషన్లతో ఉంటున్న వాహనాలకు శాశ్వత రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి అవకాశం కల్పించారు. ఇప్పటికే రాష్ట్రంలో పలు జిల్లాల్లో రవాణాశాఖ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను నిలిపివేసి ఆయా షోరూముల్లో రిజిస్ట్రేషన్లు చేయడానికి అవకాశం కల్పించారు. ప్రస్తుతం ఈ విధానాన్ని జిల్లాకు వర్తింపజేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు.
సేవలన్నీ ఆన్‌లైన్...
జిల్లాలోని అన్ని రవాణాశాఖ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిలుపుదల చేసి ఆన్‌లైన్‌లో వాహనాల రిజిస్ట్రేషన్లు పూర్తిగా జరిగేలా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. దీంతోపాటు ఫ్యాన్సీ నెంబర్లు సైతం ఆన్‌లైన్‌లో ఉంచేందుకు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో ఏలూరు జిల్లా ఉపరవాణాశాఖ కార్యాలయం, భీమవరంలోని ప్రాంతీయ రవాణాశాఖ కార్యాలయంతోపాటు తణుకు, తాడేపల్లిగూడెం, కొవ్వూరు, పాలకొల్లు, జంగారెడ్డిగూడెం ప్రాంతాల్లో యూనిట్ కార్యాలయాలు ఉన్నాయి. ఆయా కార్యాలయాల పరిధిలోని వాహన రిజిస్ట్రేషన్లు, డ్రై వింగ్ లైసెన్సులు, వాహన ఫిట్‌నెస్‌లు, రిజిస్ట్రేషన్, లైసెన్సుల రెన్యువల్స్, నకళ్లు వంటి 83 రకాల సేవలు అందిస్తుంటారు. ప్రసుతం ఈ సేవలన్నీ పొందడానికి వాహనదారులు ఆయా కార్యాలయాలకు వెళ్లాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో కొందరు ఏజెంట్లు అధికారులు, వాహనదారులకు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నేరుగా వాహనదారులే ఆన్‌లైన్ ద్వారా సేవలు పొందడానికి అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ప్రస్తుతం కార్యాలయాల్లో జరుగుతున్న రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ఆయా వాహన షోరూములకు అప్పగించనున్నారు. దీంతో వాహనం కొనుగోలు చేసిన వెంటనే రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది.
వేలిముద్రతో సేవలు...
మీసేవ, ఏపీ ఆన్‌లైన్ సేవా కేంద్రాల్లో రవాణా సేవలు లభించనున్నాయి. ఇంటర్నెట్ కేంద్రాలు, వ్యక్తిగతంగా ఆన్‌లైన్‌లో సేవలు పొందే అవకాశం ఉంది. ఆయా సేవలకు ప్రభుత్వం నిర్థేశించిన ఫీజులతోపాటు నామమాత్రపు సర్వీసు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే వాహనదారుడు వేలి ముద్రతో సేవలు అందుకోవాల్సి ఉంది. ఇçప్పటికే ఆధార్ నమోదులో ఐరిస్, వేలిముద్రలు సేకరించడంతో రవాణాశాఖలో ప్రతి సేవకు ఆధార్ తప్పనిసరి కానుంది. షోరూంలో వాహనం కొనుగోలు చేయగానే 15 నిమిషాల్లో తాత్కాలిక రిజిస్ట్రేషన్, గంట వ్యవధిలో శాశ్వత రిజిస్ట్రేషన్ చేయనున్నారు. ఇందుకు వాహనదారుడి సంతకం, వేలిముద్రలు అప్‌లోడ్ చేస్తారు. ప్రతి దరఖాస్తు ఆన్‌లైన్‌లో రవాణాశాఖకు చేరుతుంది. సంతకం, ఆధార్‌లోని వేలిముద్ర సరిపోల్చడంతో సేవలు పూర్తవుతాయి. అనంతరం పత్రాలు వాహన యజమాని ఇంటికి పంపిస్తారు. ఈ విధానంపై జిల్లాలోని ఆయా షోరూం యాజమాన్యాలకు ఈనెల 13, 14 తేదీల్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చి 15నుంచి అమలు చేయనున్నారు. ఫ్యాన్సీ నెంబర్లు విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఫ్యాన్సీ నెంబర్ కావాల్సిన వాహనదారులు ఆయా రవాణాశాఖ కార్యాయాల్లో సంప్రదించాల్సి ఉంది.
కార్యాలయానికి రానవసరం లేదు...
వాహన రిజిస్ట్రేషన్‌కు సంబంధించి వాహనదారుడు కార్యాలయానికి రాకుండానే శాశ్వత రిజిస్ట్రేషన్ పొందవచ్చు. ఇందుకు వాహనదారుడి వేలిముద్రలు తీసుకోవడంతోపాటు వాహనం ఫొటోలు తీసి కార్యాలయానికి అనుసంధానం చేస్తారు. అనంతరం కార్యాలయ అధికారులు నిర్థారించిన తర్వాత గంట వ్యవ««ధిలో శాశ్వత రిజిస్ట్రేషన్ పొందవచ్చు. ఫ్యాన్సీ నెంబర్ల విషయంలో 15 రోజుల్లో స్పష్టత రానుంది.
– ఎస్.సత్యనారాయణమూర్తి, డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్, ఏలూరు