
దోచుకునేందుకే రెయిన్‌గన్ల ప్రయోగం
అగ్రిగోల్డ్ ఆస్తులపై సీఎం కన్ను
– యాజమాన్యానికి ప్రభుత్వం వత్తాసు
– 40లక్షల మంది బాధితుల జీవితాలతో ఆటలు
– పీసీసీ చీఫ్ ఎన్ రఘువీరారెడ్డి
మడకశిర : అధికార పార్టీ నేతలు రూ.వేల కోట్లు దోచుకునేందుకు మరోసారి రక్షకతడుల పేరిట రెయిన్‌గన్లను తెరపైకి తీసుకొచ్చారని పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి అన్నారు. గత ఏడాది రెయిన్‌గన్ల ద్వారా అనంతపురం జిల్లాలో ఎన్ని వేల ఎకరాలకు రక్షక తడులు ఇచ్చి వేరుశనగ పంటను కాపాడారో చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా మడకశిరలో గురువారం రైతు సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి రాజీవ్‌గాంధీ సర్కిల్ వరకు కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు.
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అగ్రిగోల్డ్ ఆస్తులపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు, అధికార పార్టీ నేతల కన్ను పడిందన్నారు. 40 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం యాజమాన్యానికే వత్తాసు పలుకుతోందన్నారు. సీబీఐ విచారణతోనే బాధితులకు న్యాయం జరుగుతుందన్నారు. అనంతపురం జిల్లాలో హంద్రీనీవా పనులను వెంటనే పూర్తి చేయాలని కోరుతూ త్వరలోనే డీసీసీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపడతామన్నారు. ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ విషయాన్ని పూర్తిగా విస్మరించిందన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యం, మాజీ ఎమ్మెల్యే కె.సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.