కంపెనీ వ్యాప్తంగా ఓసీల్లో నిలిచిన బొగ్గు వెలికితీత
క్వారీల్లో చేరిన నీటిని తరలించే పనిలో అధికారులు
కోల్‌బెల్ట్ ప్రాంతాల్లో కొనసాగుతున్న వాన
గోదావరిఖని(కరీంనగర్) : సింగరేణి వ్యాప్తంగా రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. క్వారీల్లోకి వర్షపు నీటి చేరడంతో డంపర్లు, డోజర్లు ప్రాజెక్టుల ఉపరితలంలోనే నిలిపివేశారు. రామగుండం రీజియన్ పరిధిలో బుధవారం 2.06 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా 58,000 టన్నులు బొగ్గు ఉత్పత్తికి విఘా తం కలిగింది. ఆర్జీ–1 పరిధి మేడిపల్లి ఓసీపీలో 18వేల టన్నుల బొగ్గు, 54వేల క్యూబిక్ మీటర్ల మట్టి తొలగిం పు పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ఆర్జీ–2 పరిధి ఓసీపీ–3లో 15వేల టన్నుల బొగ్గు, లక్ష క్యూబిక్ మీటర్ల మట్టి, ఆర్జీ–3 పరిధి ఓసీపీ–1, 2 లలో మొత్తం 25వేల టన్నుల బొగ్గు, లక్షా 50వేల క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపు పనులకు విఘాతం కలిగింది.
కేటీకే ఓసీలో..
కోల్‌బెల్ట్(వరంగల్) : భూపాలపల్లి ఏరియా పరిధి కాకతీయఖని ఉపరితల గని క్వారీలో వర్షపు నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తి నిలిచింది. పని స్థలాలకు వెళ్లే బెంచీలు బురదమయంగా మారాయి. రోజుకు 6,000 టన్నుల చొప్పున రెండు రోజుల్లో 12,000 టన్నుల ఉత్పత్తి నిలిచిపోయింది. గనిలో నిలిచిన నీటిని తొలగించడానికి అధికారులు విద్యుత్ మోటార్లను ఏర్పాటు చేశారు. గనుల పరిసరాలు, బంకర్‌ల వద్ద నీరు నిలిచింది.
పాలంటూన్ పంపులతో నీటి తొలగింపు
రుద్రంపూర్(ఖమ్మం) : కొత్తగూడెం ఏరియా పరిధి ఓసీల్లో రెండు రోజులకు సుమారు 5000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం వాటిల్లింది. జీకేఓసీలో 17వేల టన్నులకు మంగళవారం 15వేలు, బుధవారం 14వేల టన్నుల ఉత్పత్తి జరిగింది. డంపర్లు, డోజర్లు నిలిచిపోయాయి. అధికారులు ప్లాన్‌టూన్ పంపుల ద్వారా నీటి ని బయటికి పంపిస్తున్నారు.
వర్షం తగ్గితేనే రెండో షిఫ్టు..
మణుగూరు రూరల్(ఖమ్మం) : మణుగూరు ఏరియా గనుల్లో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. క్వారీ లోకి వాహనాలు వేళ్లడానికి వీలులేకుండా ఉంది. స్థానిక ఓసీల నుంచి రోజుకు 25వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాల్సి ఉండగా మంగళవారం పూర్తిగా నిలిచిపోయింది. బుధవారం మెుదటి షిఫ్టు వరకు ఉత్పత్తి జరగలేదు. రెండో షిఫ్టు వరకు వర్షం తగ్గితే ఉత్పత్తి కొనసాగుతుందని అధికారులు తెలిపారు. దీంతో నిలువ ఉన్న బొగ్గును రవాణా చేస్తున్నారు.
ఆర్‌కేపీ ఓసీలో..
రామకృష్ణాపూర్(ఆదిలాబాద్) : మందమర్రి ఏరియా పరిధి రామకృష్ణాపూర్ ఓపెన్‌కాస్టు ప్రాజెక్టులో రెండు రోజులు బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. రోజు కు ఆరు వేల టన్నుల చొప్పున 12వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. దీనితో పాటు 80వేల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులు ఆగిపోయా యి. జూలై 1 నుంచి ఇప్పటివరకు లక్షా77వేల టన్నులు బొగ్గు ఉత్పత్తి చేయాల్సిండగా వర్షం కారణంగా లక్షా 24వేల టన్నులు మాత్రమే వెలికితీసినట్లు ఓసీ మేనేజర్ రాధాకృష్ణ తెలిపారు. నెల రోజుల్లో 933 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకాగా 20 లక్షల కూబీక్‌మీటర్ల ఓబీకి బదులు 11 లక్షల 4వేల తీసినట్లు పేర్కొన్నారు.