తిగుల్‌లో ఆరిపోతున్న మొక్కజొన్న పంట
- ఎండిపోతున్న పంటలు.. తీవ్ర నిరాశలో రైతన్న
- అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకుంటున్న అన్నదాతలు
జగదేవ్‌పూర్: మండలంలోని రైతన్నలు వర్షాలు లేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.అనుకున్న సమయానికి వర్షాలు పడకపోవడంతో రైతన్నలు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఈ యేడు పంటలు పండి కాలం కలసి వస్తుందనుకున్న రైతన్నలను వరుణ దేవుడు కనికరించడం లేదు. ఫలితంగా సాగు చేయడానికి వర్షాలు లేక రైతన్నలు దిగులు చెందుతున్నారు. మూడేళ్ల నుంచి రైతన్నలు పంట పండించడానికి గొడ్డు ,గోదా , ఇల్లాలి పుస్తెలు, ఇల్లు తాకట్టు పెడుతున్నారు.
కొందో గొప్పో అప్పు చేసి వచ్చిన రుక్కముతో పంటలు పండించారు. పంటలు సరిగ్గా పండక పోవడంతో రోజురోజుకు అప్పులు పెరిగి పోతున్నాయి.అప్పులు తీర్చలేక వీధిలేని పరిస్థితుల్లో రైతన్నలు ఆత్మహత్యలే శరణ్యంగా భావిస్తున్నారు.సర్కారు, సార్ల మాట విని మొత్తం మొక్కజొన్న పంటను మాత్రమే వేసినాము.కొందో గొప్పో పత్తి వేస్తే పెట్టిన పెట్టుబడి అయినా వస్తుందమోనని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పంటలకు సరిపడ నీళ్లు అందక వేసిన పంట సైతం ఎండిపోతుందని రైతులు వాపోతున్నారు.
ఎండిపోతున్న పంటలు
అధికారుల సూచన మేరకు మండలంలో గత ఏడాది కంటే ఈ సారి మొక్కజొన్న పంటను 6,400 హెక్టార్లలో సాగు చేశారు. నల్లరేగడి భూముల్లో కొంత బాగనే ఉన్నా ఎర్ర, దుంబ నెలల్లో పంటలు ఆరిపోతున్నాయి. రోహిణిలో వేసిన పంటలు పీలకల దశకు రాగా , మృగశిరలో వేసిన పంటలు తలజుట్టు దశలో ఉన్నాయి. తిగుల్, చేబర్తి, మునిగడప, చాట్లపల్లి, వట్టిపల్లి, రాయవరం తదితర గ్రామాల్లో మొక్కజొన్న పంటలు వానలు లేక పంట తడి ఆరిపోతుంది. అలాగే వానపై ఆధారపడి వరి నాట్లు వేసిన రైతులు కూడా ప్రస్తుతం వానలు లేకా ఆవేదన చెందుతున్నారు. కొన్ని గ్రామాల్లో బోర్లలో భూగర్భజాలాలు అడుగంటడంతో వరి పంటకు తీవ్ర ఇబ్బందిగా ఉంది.
బోరులో నీరు తగ్గింది: వానలు సరిగా లేకా బోరులో నీరు తగ్గింది. వానలపై అశతో నాకున్న మూడు ఎకరాల్లో ఎకరం వరి పంట వేశాను. మిగత భూమిలో ఎకరం మొక్కజొన్న, పత్తి పంటలను సాగు చేశాను. గత ఏడాది కంటే ఈ సారి తక్కువగా వానలు పడ్డాయి. ప్రక్కన చెరువు ఉన్నప్పటికి ప్రయోజనం లేదు. వానలు లేకపోతే మొక్కజొన్న, పత్తి పంటలు కూడా చేతికి అందుతాయో లేదోనని అన్నదాత ఆవేదన వ్యక్తం చేశాడు. - యువరైతు, యాదగిరి.