నిజమైన ఫ్యాక్షనిస్టులు ఆ సోదరులే
అవినీతిని ప్రోత్సహిస్తున్న మంత్రి యనమల
ఏరియా ఆసుపత్రిలో దోపిడీ చేస్తున్న తమ్ముళ్లు
ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా
తుని : రాష్ట్రంలో ఏకైక ఫ్యాక్షనిస్టు మంత్రి యనమల రామకృష్ణుడే నని తుని శాసనసభ్యుడు దాడిశెట్టి రాజా అన్నారు. శుక్రవారం స్థానిక శాంతినగర్‌లోని పార్టీ కార్యాలయ ఆవరణలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఎంతో అనుభవం ఉన్న మంత్రి యనమల రామకృష్ణుడు ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఫ్యాక్షనిస్టని విమర్శించడం మాని, ముందు తుని నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు అరాచకాలను అరికట్టాలని హితువుపలికారు. అధికారం ఉందనే బలుపుతో ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు, ప్రజలను పోలీసులతో మానసిక క్షోభకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యం కోసం నీతులు చెప్పడం కాదు.. మీ పార్టీ నాయకులను కట్టడి చేసి చూపాలని సవాల్ చేశారు. తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వైద్యం కోసం వచ్చే పేదలను జలగల్లా పీడుస్తున్న విషయం మీకు తెలియదా? అని ప్రశ్నించారు. సర్కారీ ఆసుపత్రికి వచ్చే పేదల నుంచి మీ బినామీలు డబ్బులు వసూలు చేస్తున్న విషయం గురువారం బయటపడిందన్నారు. రాష్ట్రంలోని ఎక్కువ డెలివరీలు చేస్తున్న ఏరియా ఆసుపత్రిలో అవినీతి జలగలు సామాన్యుల రక్తాన్ని పీల్చుతున్నాయన్నారు. సగటున రోజుకు 40 వరకు కాన్పులు జరుగుతుండగా.. ఒకొక్కరి నుంచి రూ.నాలుగు వేలు వసూలు చేస్తున్నారని, అంటే రోజుకు రూ. లక్ష తమ్ముళ్ల జేబులోకి వెళుతోందని ఆరోపించారు. ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రతిపక్షంలో ఉన్న మనం కట్టడి చేసేందుకు ప్రయత్నించాలని కార్యకర్తలకు సూచించారు. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని, మీకు నేను అండగా ఉంటానని కార్యకర్తలకు రాజా భరోసా కల్పించారు. జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు చేపట్టిన ధర్నాకు వందల సంఖ్యలో తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.