రజకులు పోరుబాట పట్టాలి
– రజక అభివృద్ధి సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు అంజయ్య పిలుపు
కడప రూరల్ :
రాష్ట్రంలోని రజకులు తమ సమస్యల పరిష్కారం కోసం పోరుబాట పట్టాలని రజక అభివృద్ధి సంస్థ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎం.అంజయ్య పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక హరిత హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశంలోని తొమ్మిది రాష్ట్రాలలో మినహా అన్ని రాష్ట్రాలలో రజకులు ఎస్సీ జాబితాలో కొనసాగుతున్నారని తెలిపారు. ఏళ్ల తరబడి రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని పోరాటాలు చేస్తున్నా, ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దారుణమన్నారు.
సీఎం చంద్రబాబు రజకులను ఎస్సీ జాబితాలో చేరుస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు. తమను ఎస్సీ జాబితాలో చేర్చాలని కోరుతూ చంద్రబాబును, ప్రధాని నరేంద్రమోదీని కలిసి వినతిపత్రాలను సమర్పించనున్నట్లు తెలిపారు. అనంతరం నగరంలోని స్కౌట్ హాలులో జిల్లా రజక మహాసభను ఆ సంఘం జిల్లా అ«ధ్యక్షులు సి.వెంకట రమణ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.మునెయ్య, పి.పార్వతి, పి.కమ్మన్న, పెద్ద సంఖ్యలో రజకులు పాల్గొన్నారు.