రాజాం సీహెచ్‌సీకి ఏ గ్రేడ్
రాజాం సీహెచ్‌సీకి ఏ గ్రేడ్
Published Tue, Sep 27 2016 11:13 PM | Last Updated on Mon, Sep 4 2017 3:14 PM
రాజాం రూరల్: రోగులకు సకాలంలో సరైన వైద్య సేవలు అందించడంలో రాజాం సామాజిక ఆస్పత్రి(సీహెచ్‌సీ) జిల్లాలోనే ఏ గ్రేడ్ సాధించిందని డీసీహెచ్‌ఎస్ డాక్టర్ సూర్యారావు తెలిపారు. పాలకొండ ఏరియా ఆస్పత్రి, రాజాం సీహెచ్‌సీలను మంగళవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. రాజాం సీహెచ్‌సీ పరిశీలన అనంతరం స్థానిక విలేకరులతో మాట్లాడారు.
అంకిత భావంతో సేవలు అందించడంలో, ఆస్పత్రిని శుభ్రంగా ఉంచడంలో, సాధారణ ప్రసవాలు, ఆపరేషన్ డెలివరీలు చేయడంలో, ఇతరత్రా సాధారణ శస్త్ర చికిత్సలు, ఎన్‌టీఆర్ ఆరోగ్యశ్రీ శస్త్ర చికిత్సలు జరపడంలో జిల్లాలోనే అన్ని ఆస్పత్రుల కన్నా రాజాం సీహెచ్‌సీ ముందంజలో ఉందని తెలిపారు. ప్రతీ నెలా 160కు తక్కువ లేకుండా ప్రసవాలు చేస్తున్నారని, మరో 100 వరకూ సాధారణ శస్త్ర చికిత్సలు చేస్తున్నారని చెప్పారు. ఆయనతో పాటు ఆస్పత్రి సూపరింటెండెంట్ గార రవిప్రసాద్, డిప్యూటీ సివిల్ సర్జన్ మహంతి చంద్రశేఖర్‌నాయుడు, డాక్టర్ శ్రీనివాసరావు, హెడ్ సిస్టర్ సోఫియా, ఫార్మసిస్ట్ రాజశేఖర్ తదితరులు ఉన్నారు.
Advertisement