బాబు ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో విద్యార్థులు, పేద ప్రజలకు అవస్థలు
వైఎస్ జగన్ ప్రభుత్వం నియమించిన ఆప్తాల్మిక్ అసిస్టెంట్ల తొలగింపు
కంటి పరీక్షలు
అరకొర ఆప్తాల్మిక్ అసిస్టెంట్‌లతో విద్యార్థులకు
రోజుకు 200 మంది టార్గెట్
తలకుమించిన భారమంటున్న ఆప్తాల్మిక్ అసిస్టెంట్లు
అరకొరగా పరీక్షలు.. కొన్ని చోట్ల ఉపాధ్యాయులతోనే పరీక్షలు
విద్యార్థుల భవిష్యత్తుకు ప్రమాదకరమంటున్న నిపుణులు
సీహెచ్‌సీల్లో సీఎం ఐ–కేంద్రాలూ మూసివేత
పేద ప్రజలకూ అందని కంటి వైద్య సేవలు
చంద్రబాబు కూటమి ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం స్కూలు పిల్లలకు, పేద వృద్ధులకు అందించే ‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని దెబ్బతీసింది. గత ఐదేళ్లలో రాష్ట్రంలోని ప్రతి విద్యారి్థకీ, పేదలకు కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన సూచనలు, కళ్లద్దాలు, చికిత్స అందించిన వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమం ఇప్పుడు కుంటుపడింది.
కూటమి ప్రభుత్వం రాగానే ఇటీవలి వరకు ఈ కార్యక్రమం కింద సేవలందించిన ఆప్తాల్మిక్ అసిస్టెంట్లను తొలగించడంతోపాటు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో (సీహెచ్‌సీల్లో) ఉండే ‘ సీఎం ఈ–ఐ’ కేంద్రాలను కూడా మూసివేసింది. దీంతో ఆ ఉద్యోగుల కుటుంబాలు రోడ్డునపడ్డాయి. కంటి వైద్యానికి విద్యార్థులు, పేద ప్రజలు తీవ్ర అవస్తలు పడుతున్నారు. - సాక్షి, అమరావతి
ప్రత్యేకంగా డీఎస్సీ ద్వారా..
వైఎస్ జగన్ ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమం కోసమే ప్రత్యేకంగా డీఎస్సీ ద్వారా 108 మంది ఆప్తాల్మిక్ అసిస్టెంట్లను నియమించింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉండే ఆప్తాల్మిక్ అసిస్టెంట్లతో పాటు వీరు కూడా విద్యార్థులకు కంటి పరీక్షలు చేసేవారు. వీరి సేవలను జూలై 30వ తేదీ నుంచి చంద్రబాబు ప్రభుత్వం నిలిపివేసింది. తమను కొనసాగించాలని వీరందరూ డిప్యూటీ సీఎం, మంత్రులను కోరినా పట్టించుకోలేదు. ఆగస్టు నెల నుంచి కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉన్న 208 మంది ఆప్తాల్మిక్ అసిస్టెంట్లతోనే హైసూ్కళ్లలో విద్యార్థులకు పరీక్షలు చేయిస్తోంది.
ఒక్కో ఆప్తాల్మిక్ అసిస్టెంట్‌కు రోజుకు 200 మంది విద్యార్థులను స్క్రీనింగ్ చేయాలని పలు జిల్లాల్లో లక్ష్యాలను నిర్దేశించారు. ఇది వారికి తలకు మించిన భారంగా మారింది. సాధారణంగా ఒక విద్యారి్థని పరీక్షించడానికి కనీసం పావుగంట పడుతుంది. ఈ లెక్కన రోజుకు 60 నుంచి 80 మందిని పరీక్షించడమే కష్టం. అలాంటిది 200 మందిని ఎలా పరీక్షించగలుగుతామని వారు వాపోతున్నారు. చాలా చోట్ల అరకొరగా పరీక్షలు చేసి మమ అనిపించేస్తుండటంతో దీని ప్రభావం విద్యార్థుల భవిష్యతపై పడుతోంది.
మరోపక్క కంటి వైద్యం గురించి తెలియని ఉపాధ్యాయులతో కూడా కంటి పరీక్షలు చేయించేస్తున్నారు. పిల్లల్లో మెల్ల కన్ను, శుక్లాలు, గ్లకోమా, పుట్టుకతో, పౌష్టికాహార లోపంతో వచ్చే దృష్టిలోపాలను 12 ఏళ్లలోపే గుర్తించి, వాటి నివారణకు కళ్లద్దాలు, సర్జరీలు చేయాల్సి ఉంటుంది. నిపుణులైన ఆప్తాల్మిక్ అసిస్టెంట్‌లే ఈ లోపాలను పసిగట్టడానికి వీలుంటుంది. లేని పక్షంలో ఈ సమస్యలు తీవ్రమై భవిష్యత్తుకు ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు.
సీహెచ్‌సీల్లో స్క్రీనింగ్ బంద్
అపోలో సంస్థతో ఒప్పందం ముగిసిందనే కారణంతో రాష్ట్రవ్యాప్తంగా 115 సీహెచ్‌సీల్లోని ఈ–ఐ కేంద్రాలను కూటమి ప్రభుత్వం మూసివేసింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
గత ప్రభుత్వ విన్నపం మేరకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలో 91 ఆప్తాల్మిక్ అసిస్టెంట్ పోస్టులను ఎన్నికల సమయంలో మంజూరు చేసింది. ఇప్పుడున్న ప్రభుత్వం ఈ పోస్టులను భర్తీ చేయకుండా తాత్సారం చేస్తోంది. దీంతో ప్రజలు కూడా కంటి పరీక్షలు జరగక ఇబ్బందులు పడుతున్నారు.
91 పోస్టుల్లో మమ్మల్ని సర్దుబాటు చేయాలి
వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమంలో సేవలందించిన మమ్మల్ని జూన్ నెల నుంచి ఆపేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి వేతనాలు కూడా ఇవ్వడంలేదు. మా కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
ఎన్‌హెచ్‌ఎం కింద రాష్ట్రానికి మంజూరైన 91 పోస్టుల్లో మమ్మల్ని సర్దుబాటు చేయాలి. విద్యార్థులకు కంటి పరీక్షల కోసం నైపుణ్యం లేని ఉపాధ్యాయులను వాడుతున్నారు. ప్రత్యేకంగా కంటి పరీక్షల కోసమే నియమించిన మా సేవలను వినియోగించుకుంటే పేద ప్రజలకు మేలు జరుగుతుంది. – తలారి ఆనంద్‌కుమార్, రాష్ట్ర ఆప్తాల్మిక్ అసిస్టెంట్‌ల సంఘం కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment