మహిళలకు రక్షా కవచం
విశాఖపట్నం : మహిళలు, బాలల అక్రమ రవాణా, వారిపై దాడులు, కిడ్నాప్‌లు వంటి సంఘవిద్రోహ చర్యలకు అడ్డుకట్ట వేసేందుకు జిల్లా రెవెన్యూ, పోలీసు విభాగాలు సంయుక్త కార్యాచరణ సిద్ధం చేశాయి. విశాఖను మహిళా, బాలల స్నేహపూర్వక నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ప్రకటించాయి. ‘బంగారు తల్లులు–అంగడి సరుకులు’ అనే శీర్షకతో ఇటీవల సాక్షిలో ప్రచురితమైన కధనంపై జిల్లా యంత్రాంగం తీవ్రంగా స్పందించింది. ఓ పక్క పోలీసులు దర్యాప్తు చేస్తుండగా.. మరో వైపు జిల్లా రెవెన్యూ యంత్రాంగం కూడా ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది. కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ఉమెన్ ట్రాఫికింగ్‌పై మంగళవారం జిల్లాస్థాయిలో సమీక్షించారు. మహిళలను ఆదుకునేందుకు, బాలకార్మికులు, బాల యాచకుల గుర్తింపునకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు.
వివిధ రూపాల్లో హింసకు గురయ్యే బాధిత మహిళలకు అవసరమైన మద్దతు, సహాయం అందజేయడంతోపాటు వారి పునరావాసానికి ఉద్దేశించిన వన్‌స్టాప్ సెంటర్‌పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని నిర్ణయించారు. గత ఏడాది జనవరిలో కేజీహెచ్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంపై తగిన ప్రచారం లేకపోవడం వల్ల ఫలితాలు రావడంలేదన్న అభిప్రాయాన్ని కలెక్టర్ వ్యక్తం చేశారు. ఈ కేంద్రం పనితీరును మెరుగుపర్చాలని, అవసరమైన సిబ్బందిని వెంటనే నియమించాలని ఐసీడీఎస్ పీడీ చిన్మయిదేవిని ఆదేశించారు. వన్‌స్టాప్ సెంటర్‌కు శాశ్వత భవనం కోసం విమ్స్‌లో స్థలాన్ని కేటాయించేందుకు పంపిన ప్రతిపాదనలకు వెంటనే ఆమోదం లభించేలా ఉన్నతాధికారులతో మాట్లాడతానన్నారు.
హెల్ప్‌లైన్ల ఏర్పాటు
హింసకు గురయ్యే మహిళలు 0891–2564575 లేదా ఉమెన్ హెల్ప్‌లైన్–181కు ఫిర్యాదు చేయాలని కలెక్టర్ సూచించారు. మెట్రోపాలిటన్ సిటీగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో బాలకార్మికుల, బాలయాచకుల లేకుండా చూడాలని అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను ఆయన కోరారు. నగరంలోని పలు కూడళ్లలో బాలయాచకుల సమస్య ఎక్కువగా ఉందని పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కలెక్టర్ దృష్టికి తేగా దీనిపై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించేలా పోలీస్ కమిషనర్ ఆదేశాలు జారీ చేయాలన్నారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల సమన్వయంతో బాలకార్మికులు, బాలయాచకులను గుర్తించి వారికి తగిన పునరావాసం కల్పించాలన్నారు. నగరంలో బాలకార్మికులు, బాలయాచకులు, తప్పిపోయిన బాలలను ఎవరైనా గుర్తిస్తే వెంటనే చైల్డ్ హెల్ప్ లైన్–1098కు ఫోన్ చేసి వివరాలు తెలపాలని విజ్ఞప్తిచేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో డ్రాపవుట్స్‌పై సర్వే నిర్వహించాలని సర్వశిక్ష అభియాన్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సీపీవో రామశాస్త్రి, పంచాయతీరాజ్ ఎస్‌ఈ గజేంద్ర తదితరులతో పాటు ఐసీడీఎస్ సీడీపీవోలు, సూపర్‌వైజర్లు సమావేశంలో పాల్గొన్నారు.