అనుబంధాల ‘రక్ష’
సందర్భం : నేడు రాఖీ పౌర్ణమి
అనంతపురం కల్చరల్ : మానవీయ సంబంధాలను పటిష్టం చేస్తూ.. సోదర ప్రేమకు ప్రతిరూపంగా నిలిచే ’రక్షా బంధన్‘ సంప్రదాయ విలువలను మరింత ఉట్టిపడేలా చేస్తోంది. ఉన్మాదత్వం, వెకిలి చేష్టలు పేట్రేగి, మానవతా విలువలు మంటగలుస్తున్న ప్రస్తుత ఆధునిక యుగంలో ’రాఖీ పౌర్ణమి‘ తన విశిష్టతను చాటుతూ సోదర ప్రేమ పటిష్టతకు దోహదపడుతుంది. సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమిని గురువారం ఘనంగా జరుపుకోనున్నారు.
కేవలం అన్నాచెల్లెళ్లు .. అక్కాతమ్ముళ్లకే రక్షాబంధన్ పరిమితం కాదు స్నేహానికీ ఈ బంధనం ప్రతీకగా నిలుస్తోంది. విలువలతో కూడిన ప్రేమను ఆస్వాదించే వారు ఎవరైనా సరే రాఖీ వేడుకల్లో మునిగితేలాల్సిందే. ప్రతి ఏటా శ్రావణమాసంలో వచ్చే రాఖీ పర్వదినాన్ని కులమతాలకు అతీతంగా దేశ వ్యాప్తంగా ప్రజలు జరుపుకుంటారు. శ్రావణ మాసంలో వచ్చే పండుగ కాబట్టి ఈ పండుగను శ్రావణ పౌర్ణమిగా మరి కొందరు రాఖీ పౌర్ణమిగా పిలుస్తారు.
కేరళ, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లో ‘ఆవని ఆవిట్టం’, బీహార్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, చత్తీస్‌గడ్ రాష్ట్రాల్లో ‘కజరి పూర్ణిమ’గా రక్షాబంధన్‌ని నిర్వహిస్తుంటారు. గోవా, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్రాల్లో ఈ పండుగతోనే కొత్త రుతవు ప్రారంభమైనట్లు అక్కడి ప్రజలు భావిస్తారు. ఆత్మీయ బంధాలను గాలికోదిలేస్తున్న ప్రస్తుత కాలంలో బ్రిటన్, నేపాల్, కెనడా తదితర దేశాల్లో రాఖీ పౌర్ణమిని జరుపుకుంటుండడం గమనార్హం. అనంతపురంలో వివిధ వర్గాల వారికి రాఖీ కట్టడానికి పలు స్వచ్ఛంద సంస్థలు సిద్ధమవుతున్నాయి. రాఖీ పర్వదినాన్ని ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్న కొందరి అభిప్రాయాలిలా...
రాఖీ అంటే నిండుచంద్రుడే
భారతీయ సనాతన ఆచారాలలో రక్షాబంధనానికి విశేష ప్రాముఖ్యత ఉంది. మతాలకతీతంగా సాగే జాతీయ పండుగ ఇది. భగవంతుని రక్ష అవసరమని చెప్పేది రాఖీ విశిష్టత. సమాజంలో అన్ని వర్గాల వారికి భరోసా కల్పిస్తూ మేం రాఖీలు కడతాం. ప్రపంచవ్యాప్తంగా రాఖీని జరిపేది మా సంస్థ మాత్రమే.
– శారదక్క, బ్రహ్మకుమారీ సమాజ్, అనంతపురం ఇన్‌చార్జి
అనుబంధానికి ప్రతీక
రాఖీ పండుగ నాడు మా ఇంట్లో చాలా సందడిగా ఉంటుంది. ఉద్యోగాల రీత్యా మా తమ్ముళ్లు ఒకరు సింగపూరులో, మరొకరు తిరుపతిలో ఉంటున్నారు. వాళ్లకు రాఖీలను పోస్టు ద్వారా పంపిస్తాను.
– గీతా గాంధీవాణి, యువజన సంక్షేమ శాఖ అధికారి
ఆత్మీయతకు బంధం
మా చిన్నప్పుడు కోయిలకుంట్లలో ఉండేవాళ్లం. ఉద్యోగాలరీత్యా మా అక్కాచెల్లెలు అవుకులో ఉంటున్నారు. మా మధ్య ఆత్మీయతకు బంధంగా క్రమతప్పకుండా పోస్టుల్లోనైనా వారు రాఖీలు పంపి శుభాకాంక్షలు చెబుతుంటారు.
– బీఎస్ సుబ్బారాయుడు, ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్
పోస్టులోనైనా రాఖీ వస్తుంది
మాకు అక్క మాత్రమే ఉంది. చిన్నప్పుడు బాగా సరదాగా ఉండేవాళ్లం. ఇప్పుడు అక్కయ్య వాళ్లు చిత్తూరులో ఉన్నారు. అయినా రాఖీని పోస్టల్లోనైనా పంపిస్తుంది. ఇతర ఉద్యోగులు కూడా రాఖీ కడతారు.
– వెంకటరమణ, డీఎంహెచ్‌ఓ
ఆత్మీయులను కలిపే బంధం
ప్రస్తుతం మా అక్కచెల్లెళ్లలో ఒకరు గుంటూరు, మరొకరు హైదరాబాదులో ఉంటున్నారు. మాకు ఒక అబ్బాయి. ఒక అమ్మాయి. వాళ్లు కూడా దూరంగా ఉంటున్నా రాఖీ పండుగ నాడు అందరూ క్రమం తప్పకుండా కలుస్తుంటాం.
– ప్రసాద్, హౌసింగ్ పీడీ
భారతీయ వ్యవస్థకు ప్రతిబింబం
భారతీయ కుటుంబ వ్యవస్థలో అనుబంధం చాలా బలమైంది. ఆప్యాయతకు ప్రేమానురాగాలకు రాఖీ ప్రతీక. నాకు ఇద్దరు చెల్లెళ్లున్నారు. ప్రతి రాఖీ పండుగను మేము ఉత్సాహంగా జరుపుకుంటాం. మా సిస్టర్స్ ఎక్కడున్నా నాకు రాఖీ కట్టాలని వస్తారు. మరీ దూరంగా ఉన్నప్పుడు పోస్టులో పంపిస్తారు. వాళ్ల దీవెనలే మాకు శ్రీరామరక్ష.
– అంజయ్య, జిల్లా విద్యాశాఖాధికారి