ఆంధ్రా బ్యాంక్ లాకర్‌లో 39 లక్షలు సీజ్
రైల్వే దుప్పట్ల కూడా వదిలిపెట్టలేదు..
Published Mon, Dec 26 2016 5:23 PM | Last Updated on Sat, Sep 22 2018 8:25 PM
విశాఖ: విశాఖపట్నం ఆర్‌అండ్‌బీ డీఈఈ సురేష్ చంద్ర పాత్రో ఇళ్లపై ఏసీబీ అధికారులు నిర్వహిస్తున్న సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. సోదాల్లో భాగంగా సోమవారం నగరంలోని విశాలాక్షి నగర్ ఆంధ్రాబ్యాంక్ లాకర్ తెరిచి చూడగా అందులో రూ. 39 లక్షల నగదు లభ్యమైంది. దీంతో ఏసీబీ అధికారులు నగదు స్వాధీనం చేసుకున్నారు. కాగా ఆదాయనికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలపై డీఈఈ ఇంట్లో ఏసీబీ అధికారులు శనివారం దాడులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
ఈ తనిఖీల్లో కోట్ల రూపాయల విలువైన స్థలాలు, ఫ్లాట్లు, బంగారం, వెండి వస్తువులు బయటపడ్డాయి. వీటి విలువ రూ.4.08 కోట్లకు పైగా ఉంటాయని సమాచారం. మరోవైపు పాత్రోను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు కోర్టులో హాజరు పరచగా, ఆయనకు న్యాయస్థానం జనవరి 5వ తేదీ వరకూ రిమాండ్ విధించింది.
కాగా ఏసీ రైలులో ప్రయాణించినప్పుడు బోగిలో అందించే దుప్పట్లను సైతం డీఈఈ విడిచిపెట్టలేదు. దొంగతనంగా తీసుకొచ్చిన ఆ దుప్పట్లను చూసి సోదాల సందర్భంగా ఏసీబీ అధికారులు కూడా విస్తుపోయారు. 2015, 2016 సంవత్సరానికి సంబంధించి సుమారు 65 దుప్పట్లు పాత్రో ఇంట్లో బయటపడ్డాయి.
Advertisement