సిబ్బందితో సమావేశమైన దృశ్యం
అది సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల(బాలికల) పాఠశాల. శనివారం అర్ధరాత్రి.. సమయం 12గంటలు...రోజూలాగే ఆ రోజు కూడా ఇద్దరు బాలికలు టాయిలెట్‌కు వెళ్లారు. ఇంతలో స్కూల్ కాంపౌండ్ వద్ద ముగ్గురు వ్యక్తులు సంచరిస్తూ కంటబడ్డారు. భయపడ్డ బాలికలు మీరెవరంటూ ప్రశ్నించేసరికి అగంతకులు ఇద్దరు బాలికలకు కత్తులు చూపించి బెదిరించి వారి స్వాధీనంలోకి తీసుకున్నారు. అరిస్తే చంపేస్తామంటూ ఇద్దరి బాలికలను బాత్‌రూం వైపు తీసుకుపోయి అసభ్యంగా ప్రవర్తించారు. దుస్తులు చింపేసి అసభ్యకర పదజాలంతో వ్యవహరిస్తూ కొంత సేపటి తరువాత అగంతకులు పారిపోయారు. జరిగిన విషయం వాచ్‌మేన్‌కు బాలికలు చెప్పగా దెయ్యాలు...పీడకలలంటూ కొట్టిపారేయడంతో బాలికలిద్దరు మిన్నకుండిపోయారు. నాలుగు రోజుల పాటు బిక్కుబిక్కుమంటూ గడిపిన బాలికలు బుధవారం పాఠశాలకు వచ్చిన తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పారు. దీంతో అసలు విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. బాలికలు చెప్పిన వివరాల్లోకి వెళ్తే...
పాత శ్రీకాకుళం : రూరల్ మండలంలోని ఆర్టీవో కార్యాలయానికి వెళ్లే మార్గంలో సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల బాలికల పాఠశాలలో 469 మంది విద్యార్థినులు చదువుతున్నారు. ఈ నెల 20న శనివారం రాత్రి 12 గంటల సమయంలో ఏడో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు టాయిలెట్ కోసం బయటకు వచ్చారు. అప్పటికే పాఠశాల కాంపౌండ్ పరిసర ప్రాంతంలో ముగ్గురు అగంతకులు ముఖానికి మాస్క్‌లు వేసుకొని సంచరిస్తూ బాలికలను కత్తులతో బెదిరించి బాత్‌రూం వైపు లాక్కెళ్లిపోయారు. అరిస్తే చంపేస్తామంటూ కత్తులతో బెదిరించి అసభ్యకరంగా(రాయడానికి వీల్లేని భాష) ప్రవర్తించారు. మాతో వస్తే కావాల్సినంత డబ్బులిస్తామని...బీరు తాగుతావా...అంటూ తమతో ప్రవర్తించారంటూ మీడియా ముందు జరిగిన విషయం కుండబద్దలు కొట్టారు. అన్నయ్యా...అని బతిమలాడినా వదల్లేదని భోరుమన్నారు.
గాఢనిద్రలో వాచ్‌మేన్...పట్టించుకోని ప్రిన్సిపాల్
బాలికలు జరిగిన విషయాన్ని వాచ్‌మేన్ శ్యామలమ్మకు చెప్పారు. స్కూల్లో దెయ్యాలు, పీడకలలంటూ కొట్టిపారేశారని కనీసం పట్టించుకోలేదని బాలికలు కన్నీరు పెట్టారు. మరుసటి రోజు ఆదివారం ప్రిన్సిపాల్‌కు కూడా ఈ విషయాన్ని తోటి విద్యార్థినులు చెప్పారు. స్పందించాల్సిన ప్రిన్సిపాల్ అందుకు భిన్నంగా జరిగిన విషయాన్ని గోప్యంగా ఉంచాలని బెదిరించారని తెలిపారు. చెబితే టీసీలిచ్చి పంపేస్తామని గురుకుల సిబ్బంది బెదిరించారని బాలికల తల్లిదండ్రులు మీడియాకు వెల్లడించారు. తల్లిదండ్రులు ప్రిన్సిపాల్‌ను ప్రశ్నించగా తమ ఉద్యోగాలు చదువు చెప్పడానికే తప్ప కాపాలా కాసేందుకు కాదని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని ప్రిన్సిపాల్ తీరుపై మండిపడ్డారు. ఈ సమయంలో ప్రిన్సిపాల్, విద్యార్థినుల తల్లిదండ్రుల మధ్య వాగ్వాదం నెలకొంది.
క్వార్టర్స్‌లో ఉండాల్సిందే...
ఈ విషయం గురుకుల పాఠశాల కన్వీనర్ చంద్రావతికి తెలియడంతో స్పందించారు. సిబ్బందితో సమావేశమయ్యారు. ప్రిన్సిపాల్, సిబ్బంది ఏ ఒక్కరూ క్వార్టర్స్‌లో ఉండరని తేల్చేశారు. నిరంతరం స్కూల్ ప్రధాన గేటు తెరిచే ఉంటుందని, ఎవరు వస్తున్నారో...ఎవరు వెళ్తున్నారో..తెలియని పరిస్థితి ఉందని చెప్పారు. క్వార్టర్స్‌లో ప్రిన్సిపాల్, సిబ్బంది తప్పనిసరిగా ఉండాల్సిందేనని ఆదేశించారు.
ప్రహరీ లేదు..
స్కూల్లో అన్ని వసతులున్నా పూర్తి స్థాయిలో ప్రహరీ లేదని ప్రిన్సిపాల్ ప్రభావతి చెప్పారు. ఇలాంటి సంఘటన జరగడం ఇదే తొలిసారని తెలిపారు. జరిగిన సంఘటనపై రూరల్ పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదు చేశామని చెప్పారు. రక్షణ కావాల్సి ఉందని పేర్కొన్నారు.
పిల్లలతోనే పనులన్నీ చేయిస్తారు..
స్కూల్లో ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో పిల్లలతో అన్ని పనులు చేయిస్తామని ఓ విద్యార్థిని తల్లి ఆరోపించారు. బాత్‌రూంలు కడిగిస్తారని, బియ్యం ఏరిస్తారని, గదులు శుభ్రపరచడం ఇలా అన్ని పనులు పిల్లలే చేస్తారని చెప్పారు. తల్లిదండ్రులకు చిన్నారులు చెబితే తిరిగి బాలికలను శిక్షిస్తారని ఆరోపించారు.