జాతీయ రహదారిపై రాస్తారోకో
-
ట్రాన్స్‌కో అధికారులపై తీరుపై ఆగ్రహం
-
ట్రాన్స్‌కో ఏఈని నీలదీసిన మద్నూర్ గ్రామస్తులు
మద్నూర్ : విద్యుత్ సరఫరాలో తలెత్తే ఇబ్బందులపై ట్రాన్స్‌కో అధికారులు స్పందించడం లేదని మద్నూర్ గ్రామస్తులు మంగళవారం సాయంత్రం రాస్తారోకో నిర్వహించారు. మండల కేంద్రంలోని సబ్‌స్టేషన్ వద్ద జాతీయ రహదారిపై రథ్‌గల్లీ, ఎస్సీ కాలనీవాసులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంగళవారం మధ్యాహ్నం రెండు కాలనీల్లో విద్యుత్ హై వోల్టోజీ రావడంతో టీవీలు, ఫ్రిజ్‌లు, ఎలక్ట్రానిక్ వస్తువులు చెడిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి అయినా కరెంటు సరఫరా పునరుద్ధరించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే అదే కాలనీలో విద్యుత్ వైర్లు తెగిపోయి ఇళ్లపై పడ్డాయని ఏఈకి తెలిపినా పట్టించుకోలేదని వారు మండిపడ్డారు. మధ్యాహ్నం నుంచి ట్రాన్స్‌కో అధికారులు కనీసం కాలనీకి రాలేదని ఆరోపించారు. ఈ విషయమై పలుమార్లు ఏఈకి ఫోన్ చేసినా తాను లోకల్‌లో లేనని వేరే గ్రామంలో ఉన్నానని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని వారు తెలిపారు. సాయంత్రం వరకు విద్యుత్ సరఫరా ప్రారంభం కాకపోవడంతో ఆందోళనకు దిగారు. అక్కడే ఉన్న ఏఈ శ్రీధర్‌ను నిలదీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గ్రామస్తులకు నచ్చజెప్పి రాస్తారోకోను విరమింపజేశారు.