నోటు.. పాట్లు | æcurrency problems | Sakshi
Sakshi News home page

నోటు.. పాట్లు

Published Wed, Nov 9 2016 10:50 PM | Last Updated on Mon, Sep 4 2017 7:39 PM

నోటు.. పాట్లు

నోటు.. పాట్లు

 స్తంభించిన ఆర్థిక లావాదేవీలు
 ప్రజలకు తప్పని తిప్పలు
 రిజర్వ్‌ బ్యాంక్‌ నుంచి జిల్లాకు వచ్చిన కరెన్సీ కంటైనర్లు
 శని, ఆదివారాల్లో పనిచేయనున్న బ్యాంకులు
 టోల్‌ ట్యాక్స్‌కు మినహాయింపు
సాక్షి ప్రతినిధి, ఏలూరు :
పెద్ద నోట్ల రద్దు నిర్ణయం జిల్లాను అతలాకుతలం చేసింది.  రూ.ఐదు వందలు, రూ.వెయ్యి నోట్ల మారకం రద్దు చేయడం, బ్యాంకులు, ఏటీఎంలు పనిచేయకపోవడంతో వ్యాపార, వాణిజ్యాలకు తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడ్డాయి. సామాన్యుడి జీవనం దాదాపుగా స్తంభించిందనే చెప్పాలి. చేతుల్లో వేలాది రూపాయలు ఉన్నా చిల్లర కోసం వెంపర్లాడాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. పెట్రోల్‌ బంకులు, బస్సులు, రైళ్లలో ఈ నోట్లు చెల్లుతాయని చెప్పినా వారి వద్ద కూడా సరిపడా రూ.100 నోట్లు, చిల్లర లేకపోవడంతో చేతులెత్తేశారు. దాదాపు అన్ని పెట్రోల్‌ బంక్‌ల వద్ద రూ.500 నోటు ఇస్తే పూర్తిగా ఆ మొత్తానికి పెట్రోల్‌ కొడతామని, చిల్లర లేదంటూ బోర్డులు పెట్టేశారు. వ్యాపారాలు దాదాపుగా నిలిచిపోయాయి. రూ.500 నోట్లు తీసుకున్న పెద్ద పెద్ద షాపింగ్‌ మాల్స్, బంగారం దుకాణాల్లో మాత్రమే కొంతమేర వ్యాపారం నడిచింది. సినిమా హాల్స్‌ కూడా బోసిపోయాయి. ప్రజలు తమ ప్రయాణాలను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. మీ సేవా కార్యాలయాల్లో కూడా పెద్ద నోట్లను తీసుకోలేదు. దీంతో విద్యుత్‌ బిల్లులు, ఇతర సేవలు వినియోగించుకునేవారు ఇబ్బందులు పడ్డారు. వ్యాపార సంస్థలు, హోటళ్ల నిర్వాహకులు సైతం పెద్ద నోట్లను స్వీకరించకపోవడంతో సామాన్య జనం పడిన కష్టాలు వర్ణనాతీతం. గ్రామాల్లోని హోటళ్లు, కిరాణా సరుకులు, సంతల వద్ద జనం నానా ఇబ్బందులు పడ్డారు. సామాన్య, మధ్య తరగతి ప్రజలు నిత్యావసర సరుకులు, మందులు, ఇతర వస్తువుల కొనుగోలుకు వెళితే.. రూ.100 లేదా అంతకంటే తక్కువ నోట్లు తీసుకురావాలంటూ తిప్పిపంపేశారు. చివరకు టిఫిన్‌ చేయడానికి, మందులు కొనుక్కోవడానికి కూడా ఇబ్బంది పడాల్సిన వచ్చింది. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు లేవు. ఖజానాధికారి కార్యాలయంలో లావాదేవీలు నిలిచిపోయాయి. పెద్ద నోట్ల రద్దుతో రియల్‌ ఎస్టేట్‌ రంగం కుదేలయ్యే అవకాశం కనపడుతోంది. చిరు వ్యాపారులైతే పూర్తిగా ఆదాయం కోల్పోయారు.
 
అక్కడక్కడా అరువు.. జోరందుకున్న కమీషన్‌ వ్యాపారం
 రోజూ వచ్చే వినియోగదారులకు హోటళ్లు, మద్యం దుకాణాల్లో అరువు పద్ధతిన విక్రయాలు జరిపారు. పలుచోట్ల రూ.500, రూ.1,000 నోట్లను కమీషన్‌ ప్రాతిపదికన తీసుకుని చిల్లర ఇచ్చారు. రూ.500కు రూ.100 నుంచి రూ.200 వరకు కమీషన్‌ తీసుకున్నారు. సొమ్ములున్న వారు బంగారం కొనుగోళ్లపై మొగ్గుచూపడటంతో ఒక్క రోజే  10 గ్రాములు బంగారం ధర రూ.వెయ్యికి పైగా పెరిగింది. అన్నీ పెద్దనోట్లే కావడంతో డిమాండ్‌కు తగినట్టుగా బంగారం అమ్మకాలు కొనసాగించే వీలులేక పోయింది. బుధవారం ఒక్కరోజే జిల్లాలో రూ.10 కోట్ల విలువైన బంగారం అమ్మకాలకు బ్రేక్‌ పడిందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
 
యాత్రలకు వెళ్లి అవస్థలు
జిల్లా నుంచి తీర్ధ యాత్రలకు, విహార యాత్రలకు వెళ్లిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈనెల 4వ తేదీన తణుకు నుంచి కాశీ వెళ్లిన భక్తులు చేతినిండా సొమ్ములున్నా భోజనం చేసేందుకు చిల్లర నోట్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆటో కిరాయిలకు, హోటళ్లలో తినుబండారాలకు, రూమ్‌ అద్దెలకు రూ.500 నోట్లను తీసుకోకపోవడంతో వారు పడుతున్న అవస్థలు అన్నీఇన్నీ కావు. తమ ఉన్న చిల్లర నోట్లు ఖర్చయిపోగా ప్రస్తుతం రూ. 500, రూ. 1000 నోట్లు మాత్రమే మిగిలాయని గురువారం మధ్యాహ్నానికి విమానంలో తిరుగు ప్రయాణమయ్యేలా టికెట్లు బుక్‌ చేసుకున్నామని, అప్పటివరకు మంచినీళ్లు కూడా కొనుక్కునే పరిస్థితి లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర సరిహద్దు తాటియాకులగూడెం లో గల వాణిజ్యశాఖ చెక్‌ పోస్టులో సైతం అయిదు వందలు వెయ్యి నోట్లు తీసుకోవడం మాని వెయ్యడంతో టాక్స్‌ చెల్లించడానికి కరెన్సీ లేక అనేక వాహనాలు సరిహద్దులో ఆగిపోయాయి. కలపర్రు టోల్‌ప్లాజా వద్ద చిల్లర సమస్యతో గంటల తరబడి వాహనాలు నిలిచిపోయాయి. సాయంత్రానికి కేంద్రం రెండు రోజుల పాటు టోల్‌ రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేయడంతో సమస్య సద్దుమణిగింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement