రేషన్‌ నుంచి వేలివేత! | ration nunthi velivetha! | Sakshi
Sakshi News home page

రేషన్‌ నుంచి వేలివేత!

Published Sun, Aug 14 2016 2:13 AM | Last Updated on Mon, Sep 4 2017 9:08 AM

రేషన్‌ నుంచి వేలివేత!

రేషన్‌ నుంచి వేలివేత!

ఉండి/మొగల్తూరు/నల్లజర్ల బయోమెట్రిక్‌ విధానాన్ని అమల్లోకి తెచ్చి కార్డుల సంఖ్యను కుదించిన సర్కారు తాజాగా కొత్త ఎత్తుగడ వేసింది. పేద, మధ్య తరగతి ప్రజల పొట్టకొట్టేందుకు మరో పన్నా గం పన్నింది. రేషన్‌ కార్డులో ఎంతమంది పేర్లు ఉంటే అంతమంది తమ 
రెండు చేతుల 10 వేలి ముద్రలు, ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డు నంబర్‌ నమోదు చేయించుకోవాలనే మెలిక పెట్టింది. దీనికి బెస్ట్‌ ఆఫ్‌ టెన్‌ ఫింగర్స్‌ డిటెక్షన్‌ (బీఎఫ్‌డీ) అనే పేరు పెట్టింది. దీంతో లబ్ధిదారుల పది వేళ్లలో ఏ వేలిముద్ర మంచిదో తేల్చే పనిలో పౌర సరఫరాల శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. రేషన్‌ డీలర్ల ద్వారా లబ్ధిదారులందరి వేలిముద్రలను బయోమెట్రిక్‌ యంత్రంలో నమోదు చేయిస్తున్నారు. కార్డులో పేరు నమోదైన కుటుంబ సభ్యులంతా డీలర్‌ వద్దకు వెళ్లి తమ 10 వేలి ముద్రలను ఇవ్వాలనే నిబంధన విధించడంతో వారు చౌక ధరల దుకాణాల ఎదుట బారులు తీరుతున్నారు. 
ఏరివేత నంబర్‌–2
నిన్నమొన్నటి వరకూ సర్వేలు, జన్మభూమి కమిటీ 
సిఫార్సులు, వరుసగా మూడు నెలలపాటు రేషన్‌ సరుకులు తీసుకోకపోతే రద్దు చేయడం వంటి పద్ధతుల్లో కార్డుల ఏరివేత కార్యక్రమాన్ని ప్రభుత్వం కొనసాగించింది. తాజాగా, రేషన్‌ కార్డుల్లో నమోదైన కుటుంబ సభ్యుల్ని ఏరివేత/కుదింపు కోసం లబ్ధిదారులందరి నుంచి పది వేలి ముద్రల సేకరణ (బీఎఫ్‌డీ)కు శ్రీకారం చుట్టింది. స్థానికంగా నివాసం ఉండని కుటుంబ సభ్యులను గుర్తించి వారికి రేషన్‌ బియ్యం నిలుపుదల చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఇందుకోసం రేషన్‌ డీలర్లకు బయోమెట్రిక్‌ యంత్రాలను అందించి వేలిముద్రల్ని సేకరించే కార్యక్రమం చేపట్టింది. 
ఇప్పటికే 15 వేల మందికి రేషన్‌ నిలుపుదల
జిల్లాలో 11.70 లక్షల తెల్ల రేషన్‌ కార్డులున్నాయి. వాటిలో సుమారు 95 వేల కార్డుదారులు నిత్యావసర సరుకులు తీసుకోవడం లేదు. ఇదిలావుంటే.. జిల్లా వ్యాప్తంగా సుమారు 25 వేల మందికి వేలిముద్రలు పడటం లేదనే కారణంగా రేషన్‌ సరుకుల సరఫరా నిలిపివేశారు. వారిలో వృద్ధులు, నిరుపేదలే అధికంగా ఉన్నారు. వారికి రేషన్‌ పునరుద్ధరించకపోగా.. ప్రస్తుతం ఉన్న కార్డుల్లోనూ లబ్ధిదారుల ఏరివేతకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 
అందుబాటులో లేనివారి సంగతేంటో!
బీఎఫ్‌డీ పేరిట చేపట్టిన కార్యక్రమానికి అందుబాటులో ఉన్న లబ్ధిదారులు వెళ్లి తమ రెండు చేతుల 10 వేలి ముద్రలు ఇస్తున్నారు. స్థానికంగా అందుబాటులో లేనివారికి ఇది ఆశనిపాతంగా పరిణమించింది. జీవనోపాధి కోసం పొట్ట చేతపట్టుకుని పొరుగూళ్లకు వెళ్లిన వ్యక్తులు ప్రతి రెండు కుటుంబాల్లో ఒక్కరైనా ఉండటం సహజం. ఇప్పటికిప్పుడు వారంతా వచ్చి 10 వేలిముద్రల్ని ఇవ్వడం కష్టసాధ్యం. అలాంటి వారందరికీ రేషన్‌ సరుకులు ఎగ్గొట్టే అవకాశం ఉందని పౌర సరఫరాల వర్గాలు చెబుతున్నాయి. 
పనులు మానుకుని డీలర్ల చుట్టూ..
గతంలో వేలిముద్ర లేదా సంతకం చేస్తే రేషన్‌ సరుకులు అందించేవారు. గత ఏడాది డిసెంబర్‌ నుంచి బయోమెట్రిక్‌ విధానం ప్రవేశపెట్టి కార్డులో నమోదైన వారిలో ఎవరో ఒకరి వేలిముద్ర లేదా ఐరిస్‌ గుర్తింపు ఇస్తే సరుకులు అందిస్తున్నారు. ఉద్యోగ రీత్యా, వలస కూలీలుగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు బయోమెట్రిక్‌లో విధిగా 10 వేలి ముద్రలు నమోదు చేయించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ముద్రల సేకరణ విషయమై రేషన్‌ డీలర్లకు అధికారుల నుంచి ఒత్తిడి పెరిగిపోవడంతో ఏం చేయాలో తెలియక ఆందోళనకు గురువుతున్నారు. ఈపోస్‌ యంత్రాలు పనిచేయకపోవడంతో పనులు మానుకుని వచ్చిన వారు రేషన్‌ దుకాణాల వద్ద పడిగాపులు పడాల్సిన పరిస్థితి. ఈ సందర్భంలో కార్డుదారులు, డీలర్ల మధ్య వాదోపవాదాలు చోటుచేసుకుంటున్నాయి.
రేపటి వరకే గడువు!
వేలిముద్రల సేకరణకు ఈనెల 15వ తేదీ వరకే గడువు విధించారు. 14వ తేదీ ఆదివారం, 15వ తేదీ స్వాతంత్య్ర దినోత్సవం కావడంతో సెలవు రోజులు. మరో వారం రోజులు గడువు పొడిగించినా వేలిముద్రల నమోదు కార్యక్రమం 80 శాతమైనా పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఉదాహరణకు నల్లజర్ల మండలంలో 25,850 రేషన్‌ కార్డులు ఉన్నాయి. వీటిలో 64వేల మంది లబ్ధిదారులుగా నమోదయ్యారు. రెండు నెలలుగా వేలి ముద్రల నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 68 శాతం మాత్రమే పూర్తయ్యింది. 
ఆదేశాలు రాలేదు 
వేలిముద్రల నమోదు గడువు ఈనెల 15వ తేదీతో ముగుస్తోంది. అందరూ తప్పక వేలిముద్రలు వేయాలి. వేలిముద్రలు పడనివారి జాబితాను ప్రత్యేకంగా తయారు చేయాలని ఆదేశాలందాయి. వేలిముద్రలు వేయనివారు, ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారి విషయంలో ఏం చేయాలనే దానిపై ఇంకా ఎలాంటి ఆదేశాలు అందలేదు.
– ఎం.మోహనరావు, సీఎస్‌డీటీ, ఉండి
వేలిముద్రల నమోదు తప్పనిసరి
ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం రేషన్‌ కార్డులో పేరు నమోదైన లబ్ధిదారులంతా తమ రెండు చేతుల 10 వేళ్లను రేషన్‌ డీలర్‌ వద్ద స్కాన్‌ చేయించాలి. అందుబాటులో ఉన్న ప్రతివారూ వేలిముద్రలు వేయాల్సిందే. వేలిముద్రలు ఇవ్వని వారికి మరో అవకాశం ఉంటుంది. సులువుగా రేషన్‌ తీసుకునేందుకే ఈ కార్యక్రమం.
– డి.శివశంకరరెడ్డి, జిల్లా పౌర సరఫరాల అధికారి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement