రేపు 'రాయదుర్గం–కళ్యాణదుర్గం' ప్యాసింజర్ రైలు ప్రారంభం
రాయదుర్గం టౌన్ : రాయదుర్గం నుంచి కళ్యాణదుర్గం సెక‌్షన్‌లో నూతన రైలు మార్గాన్ని ప్యాసింజర్ సర్వీస్‌తో ఈ నెల 30న శుక్రవారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. రాయదుర్గం నుంచి తుంకూరు వరకూ 207 కిలోమీటర్ల రైల్వేలైను నిర్మాణంలో కళ్యాణదుర్గం (40 కిలోమీటర్లు) వరకు రైలుమార్గం పూర్తయింది. ఇటీవల ఉన్నతాధికారులు తనిఖీలు చేసి రైలు నడిపేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. రాయదుర్గం నుంచి కళ్యాణదుర్గం ప్యాసింజర్ సర్వీసు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని చీఫ్‌కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ మల్లికార్జున తెలిపారు.
ఆ రోజు ఉదయం 10 గంటలకు విజయవాడలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్‌ప్రభు రిమోట్ వీడియో లింక్ ద్వారా రైలును ప్రారంభిస్తారు. స్థానికంగా రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉన్న హనుమంతరాయచౌదరి, మునిసిపల్ చైర్మన్ రాజశేఖర్ హాజరై జెండా ఊపీ రైలును ప్రారంభించనున్నారు. డివిజనల్ రైల్వే మేనేజర్ ఏకే జైన్, ఇతర ముఖ్య అధికారులు హాజరవుతున్నారు.