ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చమని ప్రశ్నిస్తే సీఎం చంద్రబాబు కు కోపమెందుకొస్తుందో తెలియడం లేదని వైఎస్సార్ సీపీ
‘సాక్షి’ ప్రసారాలు నిలిపివేస్తే నిజాలు దాగవు
నీరు-చెట్టులో రూ.కోట్ల అవినీతి
కలమటవి స్వార్థ రాజకీయాలు
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి
ఎల్.ఎన్.పేట: ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చమని ప్రశ్నిస్తే సీఎం చంద్రబాబు కు కోపమెందుకొస్తుందో తెలియడం లేదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి అన్నారు. ఎల్.ఎన్.పేట మండల కేంద్రంలో విలేకరులతో ఆమె శనివారం మాట్లాడారు. హామీలను అమలుచేయకపోవడం వల్లే ప్రజలు నిలదీస్తున్నారన్నారు. సాక్షి ప్రసారాలను ఆపేసినంత మాత్రాన నిజాలు దాగిపోవన్నారు. 2014 జూన్ 8న రైతు రుణమాఫీ ఫైల్‌పై సంతకం చేశారని, ఒక్క రైతుకు కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగలేదని విమర్శించారు.
డ్వాక్రా మహిళలను పూర్తిగా మోసం చేశారన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ భృతి ఊసేలేదని, మా ఇంటి మహాలక్ష్మి పథకం మూలకు చేర్చారని, అర్హులకు పథకాలు అందడం లేదని ఆరోపించారు. నీరు-చెట్టు పథకంతో కూలీల పొట్టకొట్టి తెలుగుతమ్ముళ్లకు కాసులు కురిపిస్తున్నారని విమర్శించారు. ముద్రగడ దీక్షపై మంత్రులు బాధ్యతా రాహిత్యంగా మాట్లాడడం విచారకరమన్నారు. పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటర రమణవి స్వార్థరాజకీయాలని పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఆశయాలు నెరవేరుస్తారని, జగన్‌మోహన్‌రెడ్డి పక్షాన నిలుస్తారని భావించి ప్రజలు ఓట్లేస్తే ప్యాకేజీలకు, అమరావతి భూములకు ఎమ్మెల్యే పదవిని అమ్ముకున్నారని విమర్శించారు.
2014 ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీచేసినప్పుడు పాతపట్నం నియోజక వర్గానికి చెందిన 60 వేల మంది ఓట్లు వేశారని, ఇక్కడి వారిని ఎప్పటికీ మరచిపోనన్నారు. వైఎస్సార్ సీపీ పాతపట్నం నియోజక వర్గం ఇన్‌చార్జిగా అదనపు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని, నాయకులు, కార్యకర్తలతో కలిసికట్టుగా ముందుకు సాగుతానన్నారు. ఆమె వెంట పార్టీ నాయకులు కొల్ల కృష్ణ, లోచర్ల మల్లేశ్వరరావు, ఎర్ర జనార్దన, కిలారి త్రినాథరావు, లావేటి కామేశ్వరరావు, రామకృష్ణ పట్నాయక్, అప్పన్నలు ఉన్నారు.