- సాక్షి ఎఫెక్ట్
అనంతపురం అర్బన్: ధర్మవరం మండలానికి రెగ్యులర్ తహశీల్దార్ ని నియమిస్తూ కలెక్టర్ కోన శశిధర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ధర్మవరంలో అధికార పార్టీ నేతల ఒత్తిడి కారణంగా రెగ్యులర్ తహశీల్దార్‌లు విధులు నిర్వర్తించలేని పరిస్థితి నెలకొంది. రెగ్యులర్ తహశీల్దార్‌ని నియమించినా ఆయనపై ఒత్తిడి తీసుకొచ్చి సెలవుపై వెళ్లేలా చేయడం పరిపాటిగా మారింది. ఏడాదిన్నరగా ఇక్కడ ఇన్‌చార్జి పాలన కొనసాగుతోంది. ఈ వ్యవహారంపై సాక్షిలో ఈ నెల 4న ''అధర్మ రాజ్యం'' శీర్షికన ప్రచురితమైన కథనానికి కలెక్టర్ స్పందించారు. ఇందులో భాగంగానే విడపనకల్లు తహశీల్దారుగా పనిచేస్తున్న శంకరయ్యని ధర్మవరం తహశీల్దారుగా నియమించారు. గతంలో ధర్మవరం తహశీల్దారుగా నియమించిన నాగరాజు జాయిన్ అయిన వెంటనే సెలవుపై వెళ్లారు. దీంతో ఆయనను యల్లనూరు తహశీల్దారుగా అప్పట్లో నియమించారు. అప్పటి వరకు అక్కడ తహశీల్దారుగా ఉన్న అన్వర్ హుసేన్ వీఆర్‌లో ఉన్నారు. ఈ క్రమంలో అన్వర్‌హుసేన్‌ని డ్వామాలో సూపరింటెండెంట్‌గా బదిలీ చేశారు. ఇక్కడున్న తహశీల్దారు శివయ్యని విడపనకల్లు తహశీల్దారుగా నియమించారు. ఇదిలా ఉండగా ధర్మవరానికి రెగ్యులర్ తహశీల్దారు నియామకం అధికార పార్టీ నేతల సిఫారసు ద్వారానే జరిగిందనే చర్చ రెవెన్యూ శాఖలో వినిపిస్తోంది.