వారిని విడుదల చేస్తేనే విరమణ
- అరెస్టయిన 13 మందిని విడుదల చేయాల్సిందే
- అలా కాకుంటే 30 రోజులైనా దీక్షను కొనసాగిస్తా
- కాపు ఉద్యమ నేత ముద్రగడ స్పష్టీకరణ
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘నాకు హామీలు కాదు.. చెప్పిన మాటలు ఆచరణలో పెట్టండి.. నాకేమైనా ఫర్వాలేదు.. ఆ 13 మందిని బయటకు తీసుకొచ్చి అప్పగించండి.. అలా కాకుంటే మూడ్రోజులు కాదు.. జాతికోసం 30 రోజులైనా ఆమరణ దీక్ష చేస్తా..’ ఆరోగ్యం విషమించి ఆస్పత్రిలో మంచంపై నుంచి లేవలేని స్థితిలో ఉన్న కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మాటలివి. బుధవారం చర్చల సందర్భంగా మాట్లాడుతూనే మగతలోకి వెళ్లిపోతున్న ముద్రగడను చేతులతో పట్టుకుని పైకిలేపి కూర్చోబెట్టినట్లు తెలుస్తోంది. ఆరోగ్య పరిస్థితిని చూసి కాపు జేఏసీ నేతలు తీవ్రంగా చలించిపోయి కంటతడి పెట్టారు.
వైద్య పరీక్షలు చేరుుంచుకోవాలని పదేపదే బతిమలాడడంతో తొలుత రక్త పరీక్షలకు ముద్రగడ అంగీకరించారు.దీంతో సెలైన్ కూడా పెట్టారు. అయినా ఆమరణ దీక్షను మాత్రం విరమించేది లేదని, ఆయన తేల్చి చెప్పారని జేఏసీ నేతలు తెలిపారు. తుని ఘటనలో అక్రమంగా అరెస్టు చేసిన 13 మందిని విడుదలచేసి తన వద్దకు తీసుకువచ్చిన తరువాతే దీక్ష విరమిస్తానని ముద్రగడ స్పష్టం చేయడంతో ప్రభుత్వం నుంచి చర్చలకు వచ్చిన డీఐజీ శ్రీకాంత్, కలెక్టర్ అరుణ్‌కుమార్, ఎస్పీ రవిప్రకాశ్, జేసీ సత్యనారాయణ సానుకూలత వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని జేఏసీ నేతలు, ముద్రగడ తనయుడు బాలు బుధవారం రాత్రి వేర్వేరుగా విలేకర్ల సమావేశాల్లో ధ్రువీకరించారు.
రిమాండ్‌లో ఉన్న వారిని రప్పించి..
ముద్రగడ దీక్ష బుధవారానికి ఏడో రోజుకు చేరుకుంది. మంగళవారం ప్రారంభమైన చర్చల ప్రక్రియ బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు కొనసాగింది. వైద్యానికి సహకరించాలన్న అధికారుల ప్రతిపాదనకు ముద్రగడ ససేమిరా అనడంతో అధికారులు వెనుదిరిగారు. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న కాపు ఉద్యమనేతలు ఆకుల రామకృష్ణ, నల్లా విష్ణు, వీవై దాసు, గణేషుల రాంబాబును ఆస్పత్రికి తీసుకువచ్చి దీక్ష విరమింపచేసేలా ముద్రగడతో మాట్లాడించారని సమాచారం. కానీ డీఐజీ, ఇతర పోలీసు అధికారులు మాత్రం రిమాండ్‌లో ఉన్నవారికి వైద్యం కోసమే ఆస్పత్రికి తెచ్చామని చెప్పుకొచ్చారు.
చర్చల్లో ఉత్కంఠ..:కేసులు ఎత్తివేయడమనే అంశంపై చర్చల్లో కొన్ని గంటలపాటు ప్రతిష్టంభన కొనసాగింది. కాపు జేఏసీ నేతలు అడపా నాగేంద్ర, మిండగుదిటి మోహన్, గుండా వెంకటరమణ, చినమిల్లి వెంకటరాయుడు, యాళ్ల దొరబాబు, ఆరేటి ప్రకాష్ తదితరులు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ఇంట్లో సమావేశమై అరెస్టు చేసిన వారి విడుదల, ఇక ముందు అరెస్టులు జరపకూడదనే డిమాండ్లు ప్రభుత్వం ముందుంచాలని నిర్ణయించారు. వీటికి అధికారులు సానుకూలత వ్యక్తం చేశారు. తుని ఘటనలో లోతైన విచారణ నిర్వహించాక తదనంతర చర్యలు, అరెస్టయిన 13 మందిని ఒకటి, రెండు రోజుల్లో బెయిల్‌పై విడుదల చేయిస్తామని డీఐజీ శ్రీకాంత్ హామీ ఇచ్చి చర్చలను కొలిక్కి తెచ్చారు.