కేసీకి నీరిచ్చి రైతులను ఆదుకోండి
– ఎస్‌ఈ,సీఈని కలిసి విన్నవించిన ఎమ్మెల్యే ఐజయ్య
– కేసీకి 1000 క్యూసెక్కుల నీరు విడుదల
కర్నూలు సిటీ: కర్నూలు–కడప కాలువ కింద సాగు చేసిన పంటలకు సాగు నీరు ఇచ్చి రైతులను ఆదుకోవాలని నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య.. శుక్రవారం జల వనరుల శాఖ కర్నూలు ప్రాజెక్ట్సు చీఫ్ ఇంజనీర్ సి.నారాయణ రెడ్డి, పర్యవేక్షక ఇంజనీర్ ఎస్. చంద్రశేఖర్ రావులను కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా ఐజయ్య మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీన జరిగిన నీటి పారుదల సలహా మండలి సమావేశంలో కేసీకి నీరు ఇస్తామని చెప్పడంతో నందికొట్కూరు నియోజకవర్గంలోని ఆయకట్టుదారులతో పాటు, మిగతా ప్రాంతాల్లోని రైతులు ఇప్పటీకే నారు మళ్లు వేసుకున్నారని, కానీ ఇంత వరకు కాల్వకు నీరు విడుదల చేయకపోవడం వల్ల పంటు ఎండిపోతున్నాయని, కాల్వకు నీరు ఇచ్చి పంటలను కాపాడాని కోరారు. కాల్వలకు నీటి విడుదలపై స్పష్టమైన ప్రకటన చేయడంలో జాప్యం చేయడం తగదన్నారు. 120 కి.మీ నుంచి ఉన్న ఆయకట్టుకు శ్రీశైలం నీరు ఇస్తామంటున్నారు, కానీ 0 నుంచి 120 కి.మీ వరకు ఉన్న ఆయకట్టుదారుల పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు. ఈ పంటలను కాపాడేందుకు హంద్రీనీవా నుంచి రైండు వైపులు తాత్కలికంగా కేసీ కాల్వకు మళ్లీంచాలని అధికారులను ఎమ్మెల్యే కోరారు. 0 నుంచి 120 కి.మీ వరకు ప్రస్తుతం 10 వేల ఎకరాల్లో వరి, 30 వేల ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేశారని అన్నారు. వర్షాలు లేకపోవడంతో ప్రస్తుతం ఆ పంటలన్ని ఎండుతున్నాయని ఎలాగైనా రైతన్నలను ఆదుకోని నీరు ఇవ్వాలని అధికారులను కోరారు. దీంతో అధికారులు స్పందించి కలెక్టర్ అనుమతితోS కేసీకి 1058 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దీంతో కాల్వకు నీటిని విడుదల చేసినందుకు అధికారులకు ఎమ్మెల్యే కతజ్ఞతలు తెలిపారు.