అసెంబ్లీలో రేనాటి వీరుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి
– ఘనంగా నివాళి అర్పించిన రెడ్ల సంక్షేమ సంఘం
కర్నూలు(అర్బన్): రాష్ట్ర రాజధాని అమరావతిలో నిర్మించనున్న నూతన అసెంబ్లీలో తొలి స్వాతంత్య్ర సమరయోధులు, రేనాటి వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహాన్ని ప్రతిష్టించాలని జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, ఎస్‌వీ మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కొత్తకోట ప్రకాష్‌రెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి కోరారు. బుధవారం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి సందర్భంగా రెడ్ల సంక్షేమ సంఘం, రెడ్డి యువజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేతలు ఘనంగా నివాళి అర్పించారు. ముందుగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలందరూ స్థానిక కిసాన్‌ఘాట్‌లో ఉన్న దివంగత ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి, ఆయన సమాధి వద్ద నివాళి అర్పించారు.
అనంతరం మోటారు సైకిల్ ర్యాలీగా నగరమంతా పర్యటించి జిల్లా పరిషత్‌కు చేరుకున్నారు. అనంతరం జెడ్పీ సమావేశ భవనంలో వర్దంతి సభను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు దేశ స్వాతంత్య్రం కోసం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనేక వీరోచిత పోరాటాలు నిర్వహించి, బ్రిటీష్‌వారికి కంటి మీద కునుకు లేకుండా చేశారని గుర్తు చేశారు. ఆయన జయంతి, వర్ధంతులను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించి నిర్వహించాలన్నారు. ఆయన జీవితాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగాల భరత్‌కుమార్‌రెడ్డి, శివసేన అధ్యక్షుడు ప్రతాపరెడ్డి, పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాపరెడ్డి, మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ నిడ్జూర్ భూపాల్‌రెడ్డి, ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వేషధారణలో కర్నూలుకు చెందిన మీనాక్షిరెడ్డి అందరిని ఆకట్టుకున్నారు.
ఏ క్యాంప్‌లో...
నగరంలోని ఏ క్యాంప్‌లో ఏ క్యాంపన్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 169వ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు పీ నరసింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి జే వెంకటరామిరెడ్డి, అధ్యక్షుడు నాగేశ్వరరెడ్డి, అధ్యక్షుడు డీ నాగేశ్వరరెడ్డి, యూత్ అధ్యక్ష, కార్యదర్శులు డీ ఎల్లారెడ్డి, భరత్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు మెమెంటో అందించారు.