'ఆయుష్' తీరనుందా!?
– ఉద్యోగులను తొలగించేందుకు కుట్ర
– కేవలం వైద్యుల ఉద్యోగాల రెన్యూవల్స్
- అడ్డుకున్న ఇతర ఉద్యోగులు
- అందరికీ ఒకేసారి రెన్యూవల్స్ చేయాలని డిమాండ్
అనంతపురం మెడికల్ : బాబొస్తే జాబొస్తుందనుకుంటే ఉన్న ఉద్యోగాలూ ఊడే పరిస్థితులు వచ్చాయి. ప్రకృతి వైద్యంపై ఇప్పుడిప్పుడే ప్రజల్లో ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో 'ఆయుష్'ను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం ఉద్యోగులను తొలగించే ప్రయత్నం చేస్తోంది. తాజాగా ఆయుష్ శాఖ నుంచి వచ్చిన ఉత్తర్వులు ఉద్యోగుల్లో అలజడి కలిగిస్తోంది.
ఉద్యోగులకు రెన్యూవల్ కష్టాలు..
జిల్లాలో జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (ఎన్‌ఆర్‌హెచ్‌ఎం) కింద 46 డిస్పెన్సరీలు ఉన్నాయి. ఇందులో అమడగూరు, అగళి, ఎర్రగుంట్ల ఆయుర్వేద డిస్పెన్సరీలు మూతపడ్డాయి. మిగిలిన వైద్యశాలల్లో 22 ఆయుర్వేద, 13 హోమియో, 6 యునానీ, రెండు న్యాచురోపతి డిస్పెన్సరీలున్నాయి. వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇవి నడుస్తున్నాయి. ఆయుష్ వైద్యశాలల్లో మెడికల్ ఆఫీసర్, కాంపౌండర్, స్వీపర్ కం నర్స్ (ఎస్‌సీఎన్) పోస్టులు ఉన్నాయి. ప్రస్తుతం 82 మంది కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్నారు. ఏటా వీరికి రెన్యూవల్ చేయాల్సి ఉంది. అయితే ఈ ఏడాది ఒక్కరికీ రెన్యూవల్ చేయలేదు.
డాక్టర్ లేని చోట ఉద్యోగులు ఔట్!
తాజాగా వైద్యులు లేని చోట మిగిలిన ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. గత నెల 25న ఆయుష్ శాఖ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ (ఆర్‌డీడీ) వెంకట్రామ్ నాయక్ ఆదేశాలు ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తోంది. ఉద్యోగులందరికీ ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 31 వరకు రెన్యూవల్ చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. మెడికల్ ఆఫీసర్ లేని చోట ఉద్యోగులకు ఈ ఏడాది మార్చికి మాత్రమే చేయాలని పొందుపరిచారు. రెన్యూవల్‌కు సంబంధించి బాండ్లను నవంబర్ 3న అనంతపురంలోని ఆయుర్వేద ఆస్పత్రిలో అందజేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
రెన్యూవల్ ప్రక్రియను అడ్డుకున్న ఉద్యోగులు
ఆదేశాల మేరకు గురువారం సుమారు 14 మంది మెడికల్ ఆఫీసర్లు ఉద్యోగాలను రెన్యూవల్ చేసుకునేందుకు అనంతపురంలోని ఆయుర్వేద ఆస్పత్రికి వచ్చారు. బాండ్లపై సంతకాలు చేసి 'ఆయుష్' జిల్లా సమన్వయకర్త డాక్టర్ పాటిల్ ప్రభాకర్‌రెడ్డికి అందజేయడానికి సిద్ధమయ్యారు. అప్పటికే ఈ విషయం తెలుసుకున్న ఉద్యోగులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుని ఆందోళనకు దిగారు. ‘అందరూ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నామని, మీరు మాత్రమే రెన్యూవల్ చేసుకుంటే మా పరిస్థితి ఏమిటీ’ అని మెడికల్ ఆఫీసర్లతో వాగ్వాదానికి దిగారు. చివరకు అందరూ చర్చించుకుని 'అందరికీ రెన్యూవల్' చేయాల్సిందేనని నిర్ణయించారు. ఈ విషయాన్ని ఆర్‌డీడీకి రాసిన లేఖను పాటిల్‌కు అందజేశారు. ఆందోళనలో ఆయుష్ యునైటెడ్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఈశ్వరయ్య, ఉపాధ్యక్షుడు మహేశ్, జాయింట్ సెక్రటరీలు రషీద్, సునీల్‌బాబు, ప్రసన్నరాణి, సుస్మితాబాయి, ఉద్యోగులు పాల్గొన్నారు.