‘అనంత’ కీర్తిని చాటేలా స్వాతంత్య్ర వేడుకలు
‘అనంత’ కీర్తిని చాటేలా స్వాతంత్య్ర వేడుకలు
Published Thu, Aug 11 2016 12:07 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
► ‘సాక్షి’తో కలెక్టర్ కోన శశిధర్
(సాక్షిప్రతినిధి, అనంతపురం)
స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు కావస్తోంది. ఇన్నేళ్లలో రాష్ట్రస్థాయి వేడుకలు రాజధానిలో జరగడం చూశాం. కానీ ఈసారి తొలిసారిగా ‘అనంత’లో నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లు, వీఐపీల రాక, అభివృద్ధి పనులు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ కోన శశిధర్‌ను ‘సాక్షి’ ఇంటర్వ్యూ చేసింది. ఆ విశేషాలివీ..
సాక్షి: రాష్ట్రస్థాయి వేడుకలు జిల్లాలో జరగడం ఇదే ప్రథమం. ఎలా నిర్వహిస్తున్నారు?
కలెక్టర్: ‘అనంత’లో నిర్వహిస్తామని ప్రభుత్వం చాలా తక్కువ సమయంలో ప్రకటన చేసింది. అప్పటికి 15రోజులు మాత్రమే సమయం ఉంది. వేడుకల నిర్వహణ ద్వారా జిల్లాకు ఏదో ఒక మేలు జరగాలని కాంక్షిస్తున్నాం. అందుకే రూ.2.7 కోట్లతో పీటీసీ స్టేడియాన్ని అభివృద్ధి చేస్తున్నాం.
సాక్షి: తక్కువ సమయంలో పెద్దపనికి పూనుకున్నారు.. ఉద్యోగుల సహకారం ఎలా ఉంది?
కలెక్టర్: నిజానికి 15 రోజులనేది చాలా తక్కువ సమయం. వేడుకలు నిర్వహించాలని ఆదేశాలు రాగానే పీటీసీ ప్రిన్సిపల్‌ను పిలిపించి ఏం కావాలని అడిగాం. ఆయన సూచనలు పరిగణనలోకి తీసుకున్నాం. స్టేడియానికి శాశ్వత పైకప్పు, గ్యాలరీ, రోడ్లు, మొత్తం ప్రేక్షకులు కూర్చునేందుకు వీలుగా టైల్స్‌తో స్టేడియాన్ని అభివృద్ధి చేస్తున్నాం.
ఈ పనులు త్వరితగతిన పూర్తి చేయడానికి ఆర్‌అండ్‌బీ అధికారులు చాలా చురుగ్గా పనిచేస్తున్నారు. రాత్రికి రాత్రి విజయవాడ, హైదరాబాద్‌కు వెళ్లి కాంట్రాక్టర్లతో మాట్లాడి పనులు చేయిస్తున్నారు. వారికి ప్రత్యేకంగా అభినందనలు. వారితో పాటు జిల్లాలోని ఉద్యోగులు ఇది బాధ్యత అని కాకుండా జిల్లాలో వేడుకలు జరుగుతున్నాయని గర్వంగా ఫీలయి విధులు నిర్వర్తిస్తున్నారు.
సాక్షి: స్టేడియంలో టర్ఫ్ వేయిస్తే శాశ్వతంగా క్రికెట్ మ్యాచ్‌లకు ఉపయోగపడుతుంది కదా?
కలెక్టర్: కచ్చితంగా.. ఆ ఆలోచనలో ఉన్నాం. వేడుకలు ముగిసిన తర్వాత, టర్‌్ఫతో పాటు ఫ్లడ్‌లైట్లు వేయాలని ఆలోచిస్తున్నాం. ఇప్పుడే ఫ్లడ్‌లైట్లు వేయాలనుకున్నాం. సమయం తక్కువగా ఉన్నందున సాధ్యపడడం లేదు. జిల్లాలో మంచి స్టార్‌హోటల్స్ కూడా నిర్మితమవుతున్నాయి. స్టేడియాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తే అంతర్జాతీయ స్థాయిలో అండర్–19 పోటీలు నిర్వహించే అవకాశం ఉంటుంది.
సాక్షి: వేడుకలకు ఎంతమంది హాజరుకావచ్చు? ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు?
కలెక్టర్: పదివేలమంది హాజరవుతారని అంచనా వేస్తున్నాం. ఇందులో వెయ్యిమంది వీఐపీలు ఉంటారు. మూడువేల మంది పాఠశాల విద్యార్థులు, తక్కిన వారు జిల్లా ప్రజలు. అందరికీ సరిపడేలా గ్యాలరీలు వేర్వేరుగా నిర్మిస్తున్నాం. ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నాం.
సాక్షి: సాంస్కృతిక కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి?
కలెక్టర్: ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. పాఠశాల విద్యార్థులతో మంచి కార్యక్రమాలు రూపకల్పన చేశాం. విద్యార్థులకు జాతీయజెండా సింబల్‌తో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల టీషర్టులు ఇస్తున్నాం. వేడుకల్లో ఇది ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. అలాగే పదిభారీ బెలూన్లను స్టేడియంపైన వదులుతాం.
సాక్షి: నగరాన్ని ప్రత్యేకంగా అలంకరించబోతున్నారా?
కలెక్టర్: అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలకు లైటింగ్ ఉంచాలని సూచించాం. ఇప్పటికే చాలా వరకూ లైటింగ్‌లో మెరుస్తున్నాయి. ప్రైవేటు లాడ్జీలు, దుకాణాలకు కూడా లైటింగ్ వేస్తే బాగుంటుంది. నగరాన్ని కూడా అందంగా ముస్తాబు చేస్తాం.
సాక్షి: రాష్ట్రస్థాయి వేడుకలు మీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఎలా ఫీలవుతున్నారు?
కలెక్టర్: అదృష్టంగా భావిస్తున్నా! స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కర్నూలు రాజధానిగా ఉన్నప్పుడు వేడుకలు అక్కడ జరిగాయి. తర్వాత రాజధానిలోనే జరుగుతూ వచ్చాయి. తిరిగి అమరావతి పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందితే అక్కడ జరుగుతాయి. అనంతపురంలో నేను ఉన్నపుడు నిర్వహిస్తుండడం, అందులో నా పాత్ర ఉండటం గర్వంగా ఉంది. భవిష్యత్తులో మళ్లీ అనంతలో జరుగుతాయో, లేదో తెలీదు. వేడుకలను అవకాశంగా తీసుకుని 30 ఏళ్లకిందట నీలం సంజీవరెడ్డి గారు నిర్మించిన స్టేడియాన్ని అభివృద్ధి చేస్తున్నాం. ఆ తృప్తి నాకుంది. ‘అనంత’ గర్వపడేలా వేడుకల నిర్వహణ ఉంటుంది.
Advertisement
Advertisement