ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించాలి
- బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు
కర్నూలు(న్యూసిటీ): ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు డిమాండ్ చేశారు. శుక్రవారం బి.క్యాంప్‌లోని బీసీ భవన్‌లో సామాజిక హక్కుల వేదిక ఆధ్వర్యంలో కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ ఖాన్, బీసీ జనసభ రాష్ట్ర కార్యదర్శి ఎం.నాగరాజు, ఆంధ్ర దండోరా రాష్ట్ర అధ్యక్షుడు సోమసుందరం, బీసీ జనసభ జిల్లా కార్యదర్శి శేషుఫణి, సామాజిక హక్కుల వేదిక కన్వీనర్ కె.జగన్నాథం హాజరయ్యారు. ఈ సందర్భంగా నక్కలమిట్ట శ్రీనివాసులు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ఆర్థిక విధానాల ఫలితంగా ప్రైవేట్‌రంగానికి ప్రాధాన్యం పెరిగిందన్నారు. వైద్య, విద్య రంగాల్లో కార్పొరేట్ హవా నడుస్తోందన్నారు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల కోసం నవంబర్ 5వ తేదీన మహా ధర్నా చేస్తామని పేర్కొన్నారు. నాయీబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు నరసయ్య, ఎంఆర్‌పీఎస్ రాష్ట్ర కార్యదర్శి టి.రవి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.సుబ్బయ్య పాల్గొన్నారు.