నెహ్రూ నగర్ ఘాట్
వద్దనుకున్నవే భక్తులకు చేరువ!
Published Wed, Aug 24 2016 12:50 AM | Last Updated on Mon, Sep 4 2017 10:33 AM
– మొత్తం పుష్కర స్నానం చేసింది: 14,85,608
– సగటున రోజుకు పుష్కర స్నానం చేసిన వారి సంఖ్య: 1,23,800
– అత్యధిక భక్తులు పుష్కర స్నానం చేసిన ఘాట్, సంఖ్య : నెహ్రూ నగర్(3,29,369)
– పుష్కర స్నానాలు అధికంగా చేసిన రోజు: 21వ తేదీ (2,83,583)
– పిండ ప్రదానాలు చేసిన వారి సంఖ్య: 23 వేలు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: అక్కడ పుష్కర ఘాట్‌లు వద్దనుకున్నారు. మొదట్లో ప్రతిపాదించినప్పటికీ ప్రభుత్వం నిర్మాణానికి వెనుకడుగు వేసింది. అయినప్పటికీ పుష్కర భక్తులు అక్కడికే మక్కువ చూపారు. జిల్లాలో నిర్వహించిన కృష్ణా పుష్కరాల్లో ప్రభుత్వం నిర్మించిన ఘాట్ల కంటే ప్రై వేటు ఘాట్ల వైపే ప్రజలు అధిక సంఖ్యలో అడుగులేశారు. ప్రజలకు చేరువలో ఉండటం.. స్నానం చేసేందుకు కూడా అనువుగా ఉండటంతో సామాన్య భక్తులంతా ముచ్చుమర్రి, నెహ్రూనగర్‌లోనే పుణ్యస్నానం చేసేందుకు ఆసక్తి కనపర్చారు. మొత్తం 12 రోజుల పుష్కర భక్తుల తాకిడి లెక్కలను పరిశీలిస్తే అర్థమవుతున్న విషయం ఇదే. మరోవైపు లింగాలగట్టులోని ఎగువ ఘాట్‌కు భక్తుల తాకిడి ఏమాత్రం లేకపోవడంతో ఆ ఘాటు కాస్తా వెలవెలబోయింది. ఇదే సమయంలో దిగువ ఘాట్ భక్తులతో కళకళలాడింది. మొత్తం మీద కృష్ణా పుష్కరాల్లో జిల్లావ్యాప్తంగా 14,85,608 మంది భక్తులు పుణ్యస్నానం ఆచరించారు.
144 సెక్షన్ విధించినా...
ముచ్చుమర్రిలో సొంత నిధులతో పుష్కర స్నానానికి రాయలసీమ పరిరక్షణ సమితి(ఆర్‌పీఎస్) అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి ఏర్పాటు చేశారు. అయితే, ప్రభుత్వం 144 సెక్షన్ విధించి పుష్కరస్నానాలు జరగనివ్వబోమని బీష్మించింది. మరోవైపు నెహ్రూనగర్‌లో ఘాటును ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఘాటు ఏర్పాటుపై ప్రతిపాదనలను కాస్తా చివరివరకు జలవనరుల శాఖ పంపలేదు. చివర్లో పంపినప్పటికీ ప్రభుత్వం అనుమతించలేదు. అయితే, ఈ రెండు ప్రాంతాల్లో ప్రై వేటు వ్యక్తులు ఏర్పాటు చేసిన ఘాట్లకే భక్తులు పోటెత్తారు. ఇక్కడ మొత్తం 5,47,243 మంది భక్తులు స్నానం ఆచరించారు.
ఘాట్ల వారీగా పుష్కర స్నానాలు(12 రోజుల్లో)
లింగాలగట్టు : 3,17,427
పాతాళగంగ : 3,28,558
సంగమేశ్వరం : 2,94,837
నెహ్రూనగర్ : 3,29,369
ముచ్చుమర్రి : 2,17,874
మొత్తం : 14,85,608
Advertisement