మామ తానా.. అల్లుడు తందానా: రేవంత్
చిన్నకోడూరు: మామ తానా అంటే.. అల్లుడు తందానా అన్నట్లుగా తెలంగాణలో ఇష్టారాజ్యంగా ఏలుతున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుపై టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం కరీంనగర్ వెళ్తూ మెదక్ జిల్లా చిన్నకోడూరు మండలం మెట్టు బండల వద్ద భూ నిర్వాసితులతో కలసి మాట్లాడారు. రాష్ట్రం లో మామా అల్లుళ్ల అరాచక పాలన సాగుతోం దని దుయ్యబట్టారు.‘ కేసీఆర్ సిద్దిపేటను అభివృద్ధి చేసినా చేయకపోయినా ప్రజలు సంపూర్ణ మద్దతిచ్చారు.. ఈ ప్రాంత ప్రజల భిక్షతోనే ముఖ్యమంత్రిగా ఎదిగారు.. ఆయన పోతూపోతూ అల్లుడు ఔరంగజేబుకు అప్పగించారు’ అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
మంత్రి హరీశ్‌రావు అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసులచే రైతులను బెదిరిస్తున్నారన్నారు. దుర్మార్గంగా, అరాచకంగా బీసీ, దళితుల భూములు లాక్కోవడం సరికాదన్నారు. టీఆర్‌ఎస్ సర్కార్ ప్రతివిషయంలో చంద్రబాబు ప్రభుత్వంతో పోల్చుకుంటోందని, పట్టిసీమలో రైతులకు ఎకరాకు రూ. 45 లక్షలిస్తే, కేసీఆర్ భూనిర్వాసితులు విషయంలో ఎందుకు ప్రయత్నించడం లేదన్నారు. భూ నిర్వాసితులకు ఎకరాకు రూ. 25లక్షలు చెల్లించి ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు.