ఉద్యమాలతోనే హక్కుల సాధన
ఉద్యమాలతోనే హక్కుల సాధన
Published Fri, Sep 30 2016 11:28 PM | Last Updated on Sat, Sep 15 2018 2:43 PM
చౌటుప్పల్ :
ఉద్యమాల ద్వారానే హక్కులను సాధించుకోవాలే తప్ప, కాళ్లవేళ్ల పడి కాదని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి విమర్శించారు. చౌటుప్పల్‌లో శుక్రవారం మాదిగ జేఏసీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ ఉద్యమాన్ని ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణమాదిగ తన స్వార్థానికే వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. గత 20 సంవత్సరాలుగా మంద కృష్ణ మాదిగల పేరు చెప్పుకొని, ఉద్యమిస్తూ తన స్వప్రయోజనాలకు తాకట్టు పెడుతూ ఉద్యమాన్ని నీరుగార్చారన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దళితులపై జరుగుతున్న దాడుల పట్ల ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. రాబోయే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టి ఆమోదింపజేయాలన్నారు. నవంబర్ 13న నిజాం కాలేజీ గ్రౌండ్‌లో జరిగే మాదిగల శక్తి ప్రదర్శన బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. అనంతరం ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షుడు కూరపాటి సుదర్శన్, నియోజకవర్గ అధ్యక్షుడు ఇరిగి వెంకటేష్, బోయ ప్రవీణ్‌కుమార్, ఆల్మాసిపేట కృష్ణయ్య, బొడ్డు గాలయ్య, బక్క శంకరయ్య, సుర్వి నర్సింహ, బోయ రామచంద్రం, ఉప్పు కృష్ణ, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.
Advertisement