జన్మభూమి ఉద్రిక్తం
- ధ్వజమెత్తిన జాజరకల్లు - జన్మభూమి రద్దు
- ‘అనంత’లో ఎమ్మెల్యే నిలదీత
- పి.కొత్తపల్లిలో గ్రామసభ బహిష్కరణ
- వజ్రకరూరులో అధికారులకు హితవు పలికిన ఎమ్మెల్యే విశ్వ
- గుంతకల్లులో వికలాంగులు, వితంతువుల మండిపాటు
అనంతపురం సిటీ : జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం నిర్వహించిన జన్మభూమి గ్రామసభలు ఒకింత ఉద్రిక్త వాతావరణంలో సాగాయి. ప్రజా సమస్యలపై స్పందించడం లేదంటూ ప్రజలు ప్రజాప్రతినిధులను, అధికారులను నిలదీశారు. చాలాచోట్ల వారు సమాధానం చెప్పలేక నీళ్లు నమలాల్సి వచ్చింది.
- కాలుష్యంతో గ్రామాలకు గ్రామాలు రోగాలతో పడకేశాయని, అధికారులు తమ సమస్యలను పట్టించుకోవడం లేదని డి.హీరేహాళ్ మండల పరిధిలోని జాజరకల్లు గ్రామం మొత్తం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. మీ నిర్లక్ష్యం కారణంగా ముక్కుపచ్చలారని చిన్నారులు. వృద్ధులు అనారోగ్యాలకు గురై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని గ్రామస్తులంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే గ్రామంలో 10 మంది దాకా చిన్నారులు కాలుష్యం కారణంగా జబ్బున పడ్డారని, అధికారులు మామూళ్లకు తలొగ్గి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆవేదన చెందారు. కాలుష్యం కోరల్లోంచి తమను, పొలాలను కాపాడతామని భరోసా ఇచ్చేంతవరకు ఇక్కడి నుంచి కదలనివ్వబోమని భీస్మించుకు కూర్చున్నారు. అయినా స్పందన రాకపోవడంతో సహనం కోల్పోయిన గ్రామస్తులు తహశీల్దార్ మారుతిని నిర్బంధించారు. ప్రజలకు సమాధానం చెప్పలేని అధికారులు జన్మభూమిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
- పింఛన్లు, ఇళ్ల కోసం ఎన్నిమార్లు అర్జీలు ఇచ్చినా పట్టించుకోలేదంటూ అనంతపురం నాల్గో డివిజన్‌వాసులు ఎమ్మెల్యే ప్రభాకరచౌదరిని అడ్డుకున్నారు. నేతల నిర్లక్ష్యం కారణంగా సంక్షేమ పథకాలు తమకు అందకుండా పోతున్నాయని ఆగ్రహించారు. ఎమ్మెల్యే సర్ధిచెప్పే యత్నం చేసినా స్పష్టమైన హామీ ఇవ్వాలని పట్టుబట్టారు.
- ఎన్‌పీ కుంట మండల పరిధిలోని పి.కొత్తపల్లిలో ప్రభుత్వం నిర్వహించిన జన్మభూమి ఆద్యంతం రసాబాసగా సాగింది. సోలార్ బాధితులకు పరిహారం అందించాలని అధికార పక్షంతోపాటు ప్రతిపక్షం, కమ్యూనిస్టు పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. అధికారుల నుంచి సమాదానం రాకపోవడంతో వారు జన్మభూమిని బహిష్కరించారు. అధికారుల తీరును నిరసిస్తూ బైఠాయించారు.
- మండల కేంద్రమైన వజ్రకరూరులోని స్థానిక ప్రాథమిక పాఠశాలలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అధికారులను నిలదీశారు. ప్రజల సమస్యలను పక్కన పెట్టి నేతల చుట్టూ తిరిగే వైఖరిని విడనాడాలని హితవు పలికారు. ప్రజలు అడిగే ప్రశ్నలకు సావధానంగా సమాధానం చెప్పాలని హౌసింగ్ ఏఈ షౌకత్‌అలీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
- గతంలోనూ పింఛన్ల కోసం అనేకసార్లు అర్జీలు ఇచ్చామని, ఇంకెన్నిసార్లు ఇవ్వాలని గుత్తి 22వ వార్డు(చెర్లోపల్లి)లో వికలాంగులు, వితంతువులు అధికారులను నిలదీశారు. అర్జీలతోనే సరిపెడతారా అంటూ మండిపడ్డారు.