
కారుపై మహిళ మృతదేహంతో..
అడ్డాకుల(మహబూబ్‌నగర్ జిల్లా): అడ్డాకుల శివారులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలు..మహబూబ్‌నగర్ రూరల్ మండలం గాజులపేట గ్రామానికి చెందిన తూర్పు మహేశ్వరమ్మ(46), సిద్ధిలింగం దంపతులు వనపర్తిలో ఉన్న కూతురు ఇంటికి టీవీస్ మోపెడ్ వాహనంపై వెళ్తున్నారు. అడ్డాకుల దాటగానే వెనక నుంచి వస్తున్న ఓ కారు వీరిని ఢీకొట్టింది.
మహేశ్వరమ్మ కారు ముందుభాగంలో చిక్కుకుపోయింది. సుమారు 2 కి.మీలు అలానే కారు ఆమెను లాక్కొని పోయింది. స్థానికులు గమనించి కారును వెంబడించడంతో నిందితులు కారును వదిలి పరారయ్యారు. ఈ ఘటనలో మహిళ అక్కడికక్కడే మృతిచెందగా..ఆమె భర్తకు తీవ్రగాయాలయ్యాయి. భర్తను మహబూబ్‌నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.