ప్యాలకుర్తి వద్ద రోడ్డు ప్రమాదం
Published Wed, Nov 9 2016 11:09 PM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM
- ఇద్దరికి తీవ్ర గాయాలు
- 108 రాకపోవడంతో ట్రాలీ ఆటోలో ఆస్పత్రికి తరలింపు
కోడుమూరు రూరల్: కోడుమూరు–కర్నూలు రహదారిపై ప్యాలకుర్తి గ్రామం వద్ద బుధవారం చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా, ఆరుగురు స్వల్పంగా గాయపడ్డారు. కల్లూరు మండలం పెద్దపాడుకు చెందిన రాఘవేంద్ర, ఈరన్న, రమణమ్మ, వెంకటలక్ష్మీ ఆటోలో కోడుమూరు వైపు వస్తుండగా..గోనెగండ్లకు చెందిన కౌలుట్లయ్య, క్రిష్ణమూర్తి, హుసేన్‌సాహెబ్, రంగడులతో పాటు మరో 6మంది ప్రయాణికులు టాటాఐస్ వాహనం కర్నూలుకు వెళుతున్నారు. ప్యాలకుర్తి బస్‌స్టేజి సమీపాన వంతెన వద్ద రెండు ఆటోలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో పెద్దపాడు చెందిన ఆటో డ్రైవర్ ఈరన్నకు రెండు కాళ్లు విరిగిపోగా, రాఘవేంద్ర ఒక చేయి, కాలు విరిగి తీవ్రంగా గాయపడ్డారు. గోనెగండ్ల వాసులకు స్వల్పగాయాలయ్యాయి. ఈ మేరకు కోడుమూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
సంఘటనా స్థలానికి చేరుకోని 108
రోడ్డు ప్రమాదం జరిగిన విషయాన్ని 108 సిబ్బందికి ఫోన్ చేసినప్పటికీ సకాలంలో అంబులెన్స్ చేరుకోలేదు. దీంతో ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను ఒక ట్రాలీ ఆటోలో స్థానికులు, పోలీసులు కర్నూలుకు తరలించారు.
అసంపూర్తి రోడ్డు నిర్మాణం వల్లే..
ప్యాలకుర్తి బస్‌స్టేజి సమీపంలోని వంతెన వద్ద పూర్తిగా రోడ్డు నిర్మాణాలను చేపట్టకుండా కాంట్రాక్టర్ అసంపూర్తిగా వదిలేశారు. దీంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గతంలోనూ ఇదే ప్రాంతంలో ఇన్నోవా, ద్విచక్రవాహంన ఢీకొని ఒక యువకుడు దుర్మరణం చెందాడు. తిరిగి ఇదే ప్రాంతంలో ప్రమాదం చోటు చేసుకుంది.
Advertisement
Advertisement