సురేష్ మృతదేహం వద్ద విలపిస్తున్న తల్లి(ఫైల్ )
- అక్కడికక్కడే మృతి చెందిన బాలుడు
- ఇద్దరికి తీవ్రగాయాలు
వర్గల్: మండలంలోని నెంటూరు వద్ద గురువారం ఉదయం జరిగిన ప్రమాద సంఘటన కన్నవారికి కడుపు కోత మిగిల్చింది. బాలుడి మృతితో పెను విషాదం అలుముకున్నది. టిప్పర్ వెనుక నుంచి బైక్‌ను ఢీకొన్న ఘటనలో ఓ చిన్నారి మృత్యువాతపడగా మరో ఇద్దరు గాయపడి చికిత్స పొందుతున్నారు. చిన్నారి తల్లి రోదనలతో ప్రమాదం జరిగిన ప్రాంతం దద్ధరిల్లిపోయింది. కన్నకొడుకును తలుచుకుంటూ ఆ తల్లి రోదించిన తీరు పలువురిని కలచివేసింది.
నా వజ్రాల కొండ..నన్ను విడిచిపెట్టి పోయినవా బిడ్డా
నాకు ఆస్తి లేదు..పాస్తి లేదు..మీరే నాకు ఆస్తి అని కంటికి రెప్పలెక్క కాపాడుకుంటున్న..ఇయాల తెల్లారంగనె పాలు తెచ్చెటందుకు పోయి మొత్తానికే కానరాకుండా పోయినవా బిడ్డా..అని కొడుకు మృతదేహం మీద పడి తల్లి సత్యలక్ష్మి రోదిస్తున్న తీరు అక్కడున్న వారి గుండెలు పిండేసింది.
టిప్పర్ మీద మన్నుపొయ్య..వజ్రాల కొండ లెక్క చూసుకుంటున్న నా కొడుకును నాకు దూరం చేసిండ్రని టిప్పర్ యజమానులను ఆమె శాపనార్థాలు పెడుతూ బోరుమన్నది. ఓ వైపు తల్లి, మరోవైపు తండ్రి రోదనలు ఆపడం ఎవరి తరం కాలేదు. కాగా దౌల్తాబాద్‌కు చెందిన సుతారి సత్యనారాయణ, సత్యలక్ష్మి దంపతులు పదేళ్ల క్రితం బతుకుదెరువు కోసం నెంటూరు వచ్చారు.
అక్కడి రైస్‌మిల్‌లో పని చేస్తున్నారు. కూతురు కల్పన పెళ్లి చేశారు. వారి పెద్ద కొడుకు కృష్ణ నెంటూరు స్కూల్‌లో 9 వతరగతి, మృతుడు సురేష్ నాలుగో తరగతి చదువుకుంటున్నారు. మనవరాలు మహేశ్వరి(కల్పన కూతురు) నాలుగు రోజుల క్రితం తాతా అమ్మమ్మల వద్దకు వచ్చింది. అనూహ్యంగా ప్రమాదంలో గాయపడింది.
విషాదంలో విద్యార్థి లోకం
తమ తోటి విద్యార్థుల్లో ఒకరు మృతి చెందడం, మరొకరు మృత్యువు అంచులదాకా వెళ్లి గాయాల పాలవడంతో నెంటూరు స్కూల్ విద్యార్థులు విషాదంలో మునిగిపోయారు. సురేష్ మృ తికి సంతాప సూచకంగా గ్రామంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అ నంతరం పాఠశాలలు మూసివేశారు.
ఘటన స్థలం సందర్శించిన సీఐ
నెంటూరు వద్ద ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే తొగిట సీఐ రామాంజనేయులు, బేగంపేట ఎస్సై అనీల్‌రెడ్డిలు ఘటన స్థలం సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరు పరిశీలించారు. టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడం వల్లె ఓ చిన్నారి నిండు ప్రాణాలు కోల్పోయాడని, మరో ఇద్దరు గాయాల పాలయ్యారని ఈ సందర్భంగా సీఐ పేర్కొన్నారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు టిప్పర్ డ్రైవర్ మీద కేసు నమోదు చేసినట్లు ఎస్సై అనీల్‌రెడ్డి తెలిపారు. కాగా ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.