మండపేట పెద కాలువ వంతెన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ మరణించగా, ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఎదురెదురుగా ఆటో, మోటార్ బైక్ ఢీకొనడంతో ఈ సంఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
-
ఆటో, మోటార్ బైక్ ఢీ
-
ఆటో డ్రైవర్ మృతి l
-
ఆరుగురికి గాయాలు
మండపేట :
మండపేట పెద కాలువ వంతెన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ మరణించగా, ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఎదురెదురుగా ఆటో, మోటార్ బైక్ ఢీకొనడంతో ఈ సంఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రామచంద్రపురం రూరల్ వెల్లకు చెందిన మేర్నిడి వెంకటేశ్వరరావు, మేర్నిడి సూర్యనారాయణ, కొడికళ్లపూడి రామకృష్ణ, కొడికళ్లపూడి రాఘవ, సుంకరదేవి కలిసి రాజానగరం మండలం యర్రంపాలెంలో తమ బంధువులను పరామర్శించేందుకు శనివారం మధ్యాహ్నం బయలుదేరారు. గ్రామానికి చెందిన మాధవరపు వెంకటేష్ (26) ఆటోలో వీరంతా ఎక్కారు. రామచంద్రపురానికి చెందిన నిమ్మకాయల వెంకటేష్, శివకృష్ణ రాజమహేంద్రవరం నుంచి మోటార్ బైక్‌పై రామచంద్రపురం వెళుతున్నారు. మండపేట బైపాస్ రోడ్డులోని వంతెన సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పించే క్రమంలో అదుపుతప్పి ఆటో, బైక్ ఢీకొన్నాయి. ఆటో చెట్టును ఢీకొనడంతో ఆటోడ్రైవర్ వెంకటేష్ తలకు తీవ్రగాయమై, అక్కడికక్కడే చనిపోయాడు. ఆటోలో మిగిలిన వారందరికీ తీవ్ర గాయాలయ్యాయి. అలాగే బైక్‌పై ఉన్న నిమ్మకాయల వెంకటేష్ తీవ్రంగా గాయపడగా, శివకృష్ణ సురక్షితంగా ఉన్నాడు. క్షతగాత్రులను స్థానికులు స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో సుంకరదేవి, రామకృష్ణను కాకినాడ ప్రభుత్వాస్పత్రికి పంపించారు. ఆటోడ్రైవర్ వెంకటేష్‌కు మూడేళ్ల క్రితమే వివాహమైంది. అతడికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. అతడి మరణ వార్త తెలుసుకుని, కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకున్నారు. వెంకటేష్ సోదరుడు రోదించిన తీరు చూపరులను కలచివేసింది. పట్టణ ఎస్‌ఐ నజీరుల్లా కేసు దర్యాప్తు చేస్తున్నారు.