రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక ప్రణాళిక
-
జిల్లా ఎస్పీ రవిప్రకాష్
ఆలమూరు /మండపేట :
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్టు ఎస్పీ ఎం.రవిప్రకాష్ తెలిపారు. ఆయన శుక్రవారం ఆలమూరు పోలీసు స్టేషన్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఆగి ఉన్న లారీలు, డ్రైవర్ల నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. జిల్లాలో గోపాలపురం నుంచి తుని వరకూ ఉన్న సుమారు 130 కి.మీ. పదహారవ నంబరు జాతీయ రహదారిలో అత్యంత ప్రమాదకరమైన 34 ప్రాంతాలను, 214 నంబరు రహదారిలోని కత్తిపూడి నుంచి చించినాడ వరకూ 150 కి.మీ. పరిధిలో 16 ప్రాంతాలను గుర్తించామన్నారు. రోడ్డు ప్రమాదాలకు కారణాలను విశ్లేషించేందుకు జిల్లాను మోడల్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి జియోట్యాగింగ్ విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. వీటిని జియోట్యాగ్ ద్వారా గూగుల్‌కు అనుసంధానం చేస్తామన్నారు. వీటి నిర్వహణ బాధ్యతలు ప్రైవేటు ఏజెన్సీకి అప్పగిస్తామన్నారు. కొద్ది నెలల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. ఎక్కువగా ఎక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి, అందుకు కారణాలను అధునాతన సాంకేతిక పరిజ్ఞానం సాయంతో విశ్లేషించి ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వానికి నివేదికను అందజేస్తామని రవిప్రకాష్ తెలిపారు. తరచూ ఏడీబీ రోడ్డులో జరుగుతున్న ప్రమాదాలపై కూడా దృష్టి సారించామన్నారు. ఆయా ప్రదేశాల్లోని లోపాలను గుర్తించి హైవే ఆథారిటీకి నివేదించి సూచనలు, సలహాలను అందజేశామన్నారు. వారి నుంచి అనుమతులు రాగానే ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు. ప్రతి 25 కి.మీ. దూరానికి మొబైల్ వాహనాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. రహదారులపై ఎక్కడి కక్కడ లారీలను నిలపకుండా పార్కింగ్‌కు ప్రత్యేక ప్రదేశాలను నెలకొల్పుతామని ఎస్పీ తెలిపారు. రోడ్ల పక్కన మద్యం దుకాణాలు ఏర్పాటు చేయకుండా ఉండేందుకు ఎక్సైజ్ శాఖ సహకారం తీసుకుంటామన్నారు. నాలుగు చక్ర వాహనదారులు కచ్చితంగా సీటుబెల్ట్‌ను ధరిస్తే మరణాల సంఖ్య తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు.
నేరాలు అదుపు
జిల్లాలో నేరాలు అదుపులో ఉన్నాయని ఎస్పీ ఎం.రవిప్రకాష్ తెలిపారు. ప్రస్తుతం విభిన్నమైన నేరాలు పోలీసుశాఖకు సవాల్‌గా మారాయన్నారు. నమ్మించి మోసగించడం, సైబర్ నేరాలతో పాటు ఇటీవల ఎక్కువగా మహిళల అనుమానస్పద మరణాలు జిల్లాలో ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయన్నారు. టీనేజీ బాలికల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉంటూ వారి వ్యవహారశైలిని గమనిస్తూ ఉండాలని విజ్ఞప్తి చేశారు.
కబడ్డీ బెట్టింగ్‌లు పెరిగాయ్
జిల్లాలో క్రికెట్ బెట్టింగ్‌లు తగ్గుముఖం పట్టినప్పటికీ కబడ్డీ బెట్టింగ్‌లు జరుగుతున్నాయని జిల్లా ఎస్పీ రవిప్రకాష్ తెలిపారు. సాధారణ తనిఖీల్లో భాగంగా శుక్రవారం మండపేట రూరల్ సర్కిల్ కార్యాలయానికి వచ్చిన ఎస్పీ విలేకరులతో మాట్లాడారు. కబడ్డీ బెట్టింగ్‌లను నిరోధించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో 80 పోలీస్ స్టేషన్లకు గాను 70 శాతం సొంత భవనాలు ఉన్నాయన్నారు. ఈ ఏడాది 15 పోలీస్‌స్టేçÙన్లు, ఐదు సీఐ కార్యాలయాలు, రెండు డీఎస్పీ కార్యాలయాల భవన నిర్మాణాల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్టు ఎస్పీ తెలిపారు. గంజాయి రవాణాను అడ్డుకునేందుకు ప్రత్యేక కార్యచరణను అమలుచేస్తున్నామన్నారు. మండపేటæ సీఐ వి. పుల్లారావు, రూరల్ ఎస్సై సీహెచ్ విద్యాసాగర్ పాల్గొన్నారు.
16ఆర్‌వీపీ21 : ఆలమూరులో మాట్లాడుతున్న ఎస్పీ రవిప్రకాష్