నగరంలో బుధవారం వాహనాలు బీభత్సం సృష్టించాయి. జీడిమెట్ల, ఉప్పల్ ప్రాంతాల్లో వేర్వేరు ఘటనల్లో లారీలు ఢీ కొని ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. ఉప్పల్‌లో మితిమీరిన వేగంతో వచ్చిన కారు ఒకరిని బలిగొంది. అత్తాపూర్‌లో అదుపు తప్పిన కారు ఒకరి మరణానికి కారణమైంది. ఈ ఘటనల్లో పలువురు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే...
వెంటాడిన మృత్యువు
జీడిమెట్ల: పండుగకు ఊరికివెళ్లి అటోలో నగరానికి తిరిగివస్తున్న వారిని సిమెంట్ లారీ రూపంలో మృత్యువు కబలించింది.. ఈ విషాద ఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. సీఐ శంఖర్ రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. వరంగల్ జిల్లా కాల్వాలా గ్రామానికి చెందిన వెంకన్న(45) భార్య పిల్లలతో బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చి మియాపూర్‌లో ఉంటున్నాడు. సంక్రాంతి పండగ నిమిత్తం అతను భార్య శశిరేఖ, ఇద్దరు కుమార్తెలతో కలిసి స్వగ్రామానికి వెళ్లాడు. బుధవారం నగరానికి తిరిగివస్తూ ఇద్దరు కుమార్తెలను కుత్బుల్లాపూర్‌లో వదిలి బాలానగర్ వెళ్లేందుకు ఆటోలో బయలుదేరాడు అటోలో అటో డ్రైవర్ అనిల్, అతని కుమారుడు (2), వెంకన్న, శశిరేఖ ఉన్నారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ చౌరస్తా సమీపంలో వీరు ప్రయాణిస్తున్న అటోను షాపూర్‌నుండి కుత్బుల్లాపూర్ వైపు వస్తున్న సిమెంట్ లారీ డీ కొట్టడంతో వెంకన్న కిందపడటంతో లారీ అదే వేగంతో అతని తలపైనుండి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అతని భార్య శశిరేఖ తలకు తీవ్ర గాయం కాగా అటో డ్రైవర్ అనిల్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అతని కుమారుడు(2) తృటిలో తప్పించుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రాజేంద్రనగర్‌లో కారు బీభత్సం ఒకరి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
అత్తాపూర్: రాజేంద్రనగర్ ఠాణా పరిధిలోని గాంధీనగర్‌లో ఓ కారు భీభత్సం సృష్టించింది. రోడ్డుకే అనుకొని ఉన్న ఓ ఇంటి బయట ఉన్న ఇద్దరు వ్యక్తులను ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. రాజేంద్రనగర్ ఇన్‌స్పెక్టర్ ఉమేందర్ కథనం ప్రకారం...అత్తాపూర్‌కు చెందిన ఉత్తమ్ (19), మరో ముగ్గురితో కలిసి హోండా ఎక్స్‌క్లాస్ కారులో రాజేంద్రనగర్ నుంచి హిమాయత్‌సాగర్ వైపు వెళుతున్నాడు. హిమాయత్‌సాగర్ గాంధీనగర్ బస్తీ వద్దకు రాగానే వేగంగా వెళుతున్న కారు అదుపు తప్పింది. రోడ్డుకే అనుకొని ఉన్న తమ ఇంటి ముందు నిల్చొని మాట్లాడుకుంటున్న మల్లేష్ (60), వీరాబాబు (40)లను ఢీకొనడంతో మల్లేష్ అక్కడికక్కడే మృతి చెందగా, వీరాబాబుకు రెండు కాళ్లు విరిగాయి. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వీరాబాబు రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరైంది. మల్లేష్ కుటుంబసభ్యుల రోదనలు అందరినీ కంటతడిపెట్టించాయి. వీరాబాబును చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రయాణిస్తున్న కారులో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థినులు ఉన్నట్లు సమాచారం. రోడ్డు ప్రమాదానికి కారుకుడైన ఉత్తమ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడికి డ్రైవింగ్ లైసెన్స్ లేనట్లుగా గుర్తించారు.
ఉప్పల్‌లో.. ఒకరి దుర్మరణం
ఉప్పల్: అతి వేగంగా వచ్చిన ఓ కారు ఉప్పల్‌లోని వరంగల్ జాతీయ రహదారిపై బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో వృద్దురాలు అక్కడికక్కడే మృతిచెందగా మరో కారు పూర్తిగా ధ్వంసమైంది. ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం జరిగిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. ఉప్పల్ దేవేందర్‌నగర్‌కు చెందిన ఇటికాల యాదమ్మ (60) స్థానిక కూరగాయల మార్కెట్‌లో కూరగాయలు విక్రయిస్తుంటుంది. బుధవారం మార్కెట్‌కు వస్తుండగా బోడుప్పల్ వస్తున్న కారు అదుపు తప్పి యాదమ్మను ఢీకొట్టింది. అంతటితో ఆగక ముందు వెళ్తున్న మరో కారు ను ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యాదమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. యాదమ్మ కుమారుడు నర్సింగ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
బైకును ఢీకొన్న లారీ ఒకరి మృతి, మరొకరికి గాయాలు
మేడ్చల్: మేడ్చల్ –గండిమైసమ్మ రోడ్డులో బాసిరేగడి వద్ద బుధవారం మధ్యాహ్నం బైక్‌ను లారీ ఢీ కొనడంతో ఒకరు మృతి చెందగా మరొకరు గాయపడ్డారు. సీఐ రాజశేఖరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం జీడీమెట్ల సాయిబాబా నగర్ కు చెందిన వెంకటసత్యనారాయణ రాజు(46), గాంధీనగర్‌కు చెందిన చంద్రప్రకాష్(35), సాయిబాబానగర్‌కు చెందిన గోవిందరాజు(52) వెల్డింగ్ పని చేసేవారు. బుధవారం మధ్యాహ్నం వారు ముగ్గురు కలిసి అయోధ్య చౌరస్తా నుండి గండిమైసమ్మ వైపువెళుతుండగా బాసిరేగడి సమీపంలో మలుపు వద్ద వెనుక నుండి వస్తున్న అతివేగంగా వెళుతున్న లారీ ఒక్క సారిగా ఎడమ వైపు తిప్పడంతో బైక్ అదుపు తప్పి లారీ వెనుక చక్రాల కిందకు వెళ్ళింది. ఈ ప్రమాదంలో చంద్రప్రకాష్ అక్కడికక్కడే మృతి చెందగా, గోవిందరాజు, సత్యనారాయణ తీవ్రంగా గాయపడ్డారు . మేడ్చల్ పోలీసులు బాధితులను 108 వాహనంలో ఆసుపత్రికి తరలించి మృతదేహాన్ని మేడ్చల్ మార్చురీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మృత్యుశకటాలు
Published Thu, Jan 19 2017 3:17 AM | Last Updated on Sat, Aug 25 2018 5:41 PM
Advertisement
Advertisement