
ఉండవల్లి పక్కగా తుళ్లూరు వెళ్లే రోడ్డు
సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా ప్రధాన రోడ్లను నిర్మిస్తేనే సీడ్ కేపిటల్‌లో నగర నిర్మాణ పనులు వేగవంతమవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, సీఆర్‌డీఏ ఉన్నతాధికారులు కసరత్తు మొదలు పెట్టారు. అక్టోబరు 22న రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లోగానే మాస్టర్ డెవలపర్ ఎంపిక పూర్తవుతుంది. పనులు మొదలయ్యాక భారీ యంత్రాలు, వాహనాల రాకపోకలు పెరుగుతాయి.
చెన్నై, కృష్ణపట్నం, కాకినాడ పోర్టుల నుంచి భారీ నిర్మాణ సామాగ్రి వస్తుంది. మంగళగిరి వై జంక్షన్ దగ్గర భారీ మెటీరియల్ స్టాక్ పాయింట్‌ను ఏర్పాటు చేసి అక్కడి నుంచి సీడ్ కేపిటల్ వరకూ చిన్నచిన్న వాహనాల్లో వీటిని తరలించాలని యోచిస్తోంది. ఇందుకోసం నాలుగు వరుసల రోడ్లు నిర్మించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా సీఆర్‌డీఏ అధికారులు మూడ్రోజుల క్రితం కన్సెల్టెన్సీలను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఐదో నంబరు జాతీయ రహదారిలో కృష్ణానదిపై నిర్మించిన కనకదుర్గమ్మ వారధి నుంచి ఉండవల్లి మీదగా సీడ్‌కేపిటల్ ప్రాంతం వరకూ 15 కిలోమీటర్ల మేర నిర్మించ తలపెట్టిన నాలుగు వరుసల యాక్సెస్‌రోడ్డు పనులను చేపట్టదల్చుకున్న కన్సెల్టెన్సీ సంస్థలు ఈ నెల 8 లోగా తమ సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)లను అందజేయాల్సి ఉంటుంది. దీన్నిబట్టి చూస్తే మణిపాల్ ఆస్పత్రి ముందున్న కరకట్ట రోడ్డు మీదుగా ఫై్లవోవర్, సీతానగరం రైల్వే లైనుపై రైల్ ఓవర్ బ్రిడ్జి నిర్మిస్తారు.
ఇక్కడున్న కొండ చుట్టూ మళ్లీ ఫై్లవోవర్‌ను కొనసాగించి ప్రకాశం బ్యారేజీ రోడ్డుకు కలుపుతారు. మళ్లీ ఇక్కడి నుంచి నాలుగు వరుసల రోడ్డు మొదలై ఉండవల్లి, పెనుమాక పక్కగా తాళ్లాయిపాలెం వరకూ వెళ్తుంది. కృష్ణా జిల్లా గొల్లపూడి తొమ్మిదో నంబరు జాతీయ రహదారి నుంచి కృష్ణానది మీదగా రాజధాని ముఖద్వారం నుంచి గేట్‌వే పక్కగా వెళ్లే నాలుగు వరసల ఎక్స్‌ప్రెస్ వే మార్గంలో ఈ 15 కి.మీ యాక్సెస్ రోడ్డు కలుస్తుంది.
ఐదో నంబరు రహదారి నుంచి మరో ఎక్స్‌ప్రెస్ వే?
ఐదో నెంబరు జాతీయ రహదారి నుంచి కూడా మరో ఎక్స్‌ప్రెస్ వేను సీడ్‌కేపిటల్ వరకూ నిర్మించే వీలుంది. సీడ్ కేపిటల్ మాస్టర్‌ప్లాన్‌లో పొందు పర్చిన ప్రకారం తాడేపల్లికు శివారునున్న కొలనుకొండ- కృష్ణా పశ్చిమ డెల్టా కాల్వలకు ఉత్తరంగా హైవే నుంచి మొదలయ్యే నాలుగు వరుసల ఎక్స్‌ప్రెస్ వే తాడేపల్లి మండల కార్యాలయం పక్కగా ఉండవల్లికి ఉత్తరంగా కొండల వరకూ వెళ్తుంది. ఇక్కడున్న కొండకు సొరంగం వేసి పెనుమాక, కృష్ణాయపాలెం, మందడం మీదగా తాళ్లాయిపాలెం వరకూ ఈ రోడ్డు నిర్మాణం ఉంటుంది.
దీనికి సంబంధించిన వివరాలను మాత్రం సీఆర్‌డీఏ నోటిఫికేషన్‌లో పొందుపర్చలేదు. సీడ్ కేపిటల్‌కు అనుసంధాన(ఆర్టేరియల్) రహదారులన్నింటినీ ఒకే సంస్థకు అప్పగించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. భౌగోళిక అంశాలను పరిశీలిస్తే రాజధాని ప్రాంతం మొత్తం గుంటూరు జిల్లా వైపే అభివృద్ధి చెందే వీలున్నందున రోడ్డు మార్గాలన్నీ ఎక్కువగా ఇటువైపే ఉంటాయని అధికారవర్గాలు చెబుతున్నాయి. రాయలసీమ జిల్లాల నుంచి రాజధానికి వచ్చే ప్రధాన రోడ్లన్నింటినీ ఇవి కలుపుకుని సీడ్ కేపిటల్ వరకూ తీసుకెళ్తాయని వీరంటున్నారు.