సిటి స్కూళ్లలో రాక్ బ్యాండ్ ట్రెండ్
సిటీలో రాక్ ట్రెండ్ కొత్త పుంతలు తొక్కుతోంది. పాశ్చాత్య సంగీత అభిరుచితో పాటు ఆ వాయిద్యాలను పలికించడంలో నిష్ణాతులైన కొందరు టీమ్‌గా బ్యాండ్స్ ఏర్పాటు చేయడంతో మొదలై తర్వాత కార్పొరేట్ కంపెనీలు, కళాశాలలకు అనుబంధమైన ఈ ట్రెండ్ ఇప్పుడు స్కూళ్లకూ వచ్చేసింది. సిటీలోని ఇంటర్నేషనల్ స్కూల్స్ బాయ్స్ రాక్‌తో ఉర్రూతలూగిస్తుంటే... దేశంలో ప్రప్రథమ ఆల్ గర్‌్ల్స బ్యాండ్‌తో మరో స్కూల్ కి‘రాక్’ పుట్టిస్తోంది. – ఎస్.సత్యబాబు
చి‘రాక్’...
నగరంలో రాక్ మ్యూజిక్ అంటే 90 శాతానికి పైగా పురుషులకే సొంతం. ఇక బ్యాండ్స్ ఏర్పాటు విషయానికి వస్తే వాటిలో అమ్మాయిలను వెతకాలంటే భూతద్దం పట్టుకొని మరీ చూడాల్సిందే. అలాంటిది సిటీలో తొలిసారిగా ఆల్ గర్‌్ల్స బ్యాండ్ వెలుగులోకి వచ్చింది. అందులోనూ అందరూ టీనేజ్ అమ్మాయిలే. సిటీలో ప్రసిద్ధి చెందిన ఇంటర్నేషనల్ స్కూళ్లలో ఒకటైన ‘చిరెక్’కు చెందిన మ్యూజిక్ డిపార్ట్‌మెంట్ ఈ బ్యాండ్‌కి శ్రీకారం చుట్టింది. ‘చిరెక్ గర్ల్స్ బ్యాండ్’ పేరుతో రూపుదిద్దుకున్న ఈ రాక్ సంగీత బృందంలో ఎం.తరుణి(బేస్ గిటార్), తృప్తి జోషి(గిటార్), ప్రకృతి మహేశ్వరి(గానం), స్మృతి జోషి(డ్రమ్స్), మీరా మారియా పెరియెరా(గిటార్), సంజనా యాదగిరి (గిటార్) ఉన్నారు.
వీరంతా అటు చదువులో, ఇటు సంగీతంలోనూ రాణిస్తున్నారని.. వీరి ఉత్సాహం చూసే తాము ఈ బ్యాండ్‌కు రూపకల్పన చేశామని స్కూల్ మ్యూజిక్, డ్యాన్స్ విభాగం హెచ్‌ఓడీ బి.డేవిడ్ ప్రభాకర్ చెప్పారు. చిరెక్ గర్‌్ల్స బ్యాండ్(సీబీఎస్‌ఈ) పేరుతో మరో గర్‌్ల్స బ్యాండ్ కూడా ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే ఈ రెండు బృందాల ఆధ్వర్యంలో ప్రదర్శనలు నిర్వహిస్తున్నామన్నారు.
టీనేజ్ బ్యాండ్స్... సక్సెస్ ట్రెండ్స్
విదేశాల్లో టీనేజ్ బ్యాండ్స్ కొత్త కాదు. అయితే మన దేశంలో ఇటీవల స్కూల్ దశలోనే రాక్ చేరువవుతోంది. గిటార్, కీబోర్డ్... తదితర సంగీత పరికరాలపై టీనేజర్లలో పెరుగుతున్న ఇష్టమే దీనికి కారణం. వీటిని పలికించడంలో కాస్తంత నైపుణ్యం వచ్చాక తొలి దశలోనే వ్యక్తిగతంగా ప్రతిభా ప్రదర్శనకు పూనుకోవడం కంటే... తమ సహ విద్యార్థులతో కలిసి బృందంగా ఏర్పడి ప్రదర్శనలివ్వడం మేలని డేవిడ్ ప్రభాకర్ చెబుతున్నారు. మరికొందరితో కలిసి రాక్ ప్రదర్శనలివ్వడంతో కమ్యూనికేషన్, కో–ఆర్డినేషన్ స్కిల్స్, క్రమశిక్షణ అలవడతాయన్నారు.
అందుకే రాక్ బ్యాండ్స్ ట్రెండ్స్‌ను ప్రోత్సహిస్తున్నామన్నారు. ఇంటర్నేషనల్ స్కూల్స్ పేరు మీదే బ్యాండ్ ఏర్పాటు చేయడం వల్ల సముచిత రీతిలో, సామాజిక ప్రయోజనకరమైన సంగీత ప్రదర్శనలకు వీలు కలుగుతుందని.. ఇది ఆహ్వానించదగిన పరిణామమని నగరంలో రాక్ కల్చర్‌కు ఊపునిచ్చిన వారిలో ఒకరైన అంజానీ అన్నారు.
మూడు నెలల కృషి...
రాక్ మ్యూజిక్ పురుషులకే పరిమితమైన రంగం కాదు. ఈ ఉద్దేశంతోనే మూడు నెలల కృషి అనంతరం ఈ బ్యాండ్ ఏర్పాటు చేశాం. పాశ్చాత్య సంగీత పరికరాలు పలికించడంలో చక్కని నైపుణ్యమున్న అమ్మాయిలను ప్రోత్సహించేందుకు రాక్ బ్యాండ్స్ ఉపయోగపడతాయి. సహ సంగీత కళాకారులు అందరూ అమ్మాయిలే ఉండడంతో వీరు మరింత స్వేచ్ఛగా మ్యూజిక్ ప్లే చేయగలుగుతారు. ఇప్పటికే ‘ప్లేయింగ్ ఫర్ ఛేంజ్’ పేరుతో పలు ప్రదర్శనలిచ్చిన ఈ బృందం ఈ ఏడాది చివర్లో జరిగే భారీ ఫండ్ రైజింగ్ ఈవెంట్‌లోనూ ప్రదర్శనకు సిద్ధమవుతోంది. – డేవిడ్ ప్రభాకర్, పాశ్చాత్య సంగీత శిక్షకులు