
యలమంచిలి రాముపై రౌడీషీటు
కాల్‌మనీ- సెక్స్ రాకెట్ కేసులో ప్రధాన నిందితుడు ఇతనే
విజయవాడ సిటీ: కాల్‌మనీ-సెక్స్ రాకెట్ కేసులో ప్రధాన నిందితుడు యలమంచిలి శ్రీరామమూర్తి అలియాస్ రాముపై మాచవరం పోలీసులు రౌడీషీటు తెరిచారు. గతేడాది డిసెంబర్‌లో పటమట పంటకాల్వ రోడ్డులో ఫైనాన్స్ వ్యాపారం పేరిట రాము ఓ మహిళను బెదిరించి లొంగదీసుకోవడంతో పాటు ఆమెను పలు రకాలుగా వేధింపులకు గురిచేసిన విషయం తెలిసిందే. బాధిత మహిళ ఫిర్యాదుపై మాచవరం పోలీసులు పలు సెక్షన్ల కింద యలమంచిలి రాము సహా ఏడుగురిపై కేసు నమోదు చేశారు. కేసు తీవ్రత దృష్ట్యా ఉన్నతాధికారుల ఆదేశాలతో రాముపై పోలీసుల రౌడీషీటు తెరిచారు.
ఇదిలా ఉండగా కేసులో నిందితుడైన చెన్నుపాటి శ్రీనివాసరావు ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసినట్టు తెలిసింది. స్థానిక పోలీసుల వద్ద లొంగిపోయి బెయిల్ తీసుకోవాలంటూ కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు రెండు మూడు రోజుల్లో పోలీసుల వద్దకు రానున్నట్టు సమాచారం.
సత్యానందంకు రిమాండ్
కాలమనీ కేసులో నాలుగో నిందితుడు ఎం.సత్యానందంను పీటీ వారెంట్‌పై ఒకటో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో మాచవరం పోలీసులు గురువారం హాజరుపరిచారు. విచారించిన న్యాయమూర్తి మహ్మద్ అబ్దుల్ నిందితుడికి ఈ నెల 12వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులిచ్చారు.