నకిలీ విత్తనాలతో రూ. వంద కోట్ల నష్టం
నకిలీ విత్తనాలతో రూ. వంద కోట్ల నష్టం
Published Fri, Oct 7 2016 11:08 PM | Last Updated on Mon, Sep 4 2017 4:32 PM
డీసీసీ అధ్యక్షుడు మక్కెన మల్లికార్జునరావు
బొల్లాపల్లి: నకిలీ విత్తనాలు అంటగట్టి అన్నదాతలను నట్టేట ముంచిన వారిపై కేసులు నమోదుచేసి కఠిన చర్యలు తీసుకోవాలని డీసీసీ అధ్యక్షుడు మక్కెన మల్లికార్జునరావు డిమాండ్ చేశారు. మండలంలోని పేరూరిపాడు, వెల్లటూరులో పర్యటించి నకిలీ విత్తనాలతో దెబ్బతిన్న రైతులతో శుక్రవారం ఆయన మాట్లాడారు. గూడూరి ఆదినారాయణ, రామకృష్ణ, శేషగిరి తదితర రైతుల పొలాలను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మిరప పంట కోసం ఆశీర్వాద్, బ్రహ్మాష్, జీవా, మలబార్ కంపెనీల విత్తనాలు కేజీ రూ. 30వేలకు పైగా వెచ్చించి కొనుగోలు చేసి రైతులు నార్లు పోసుకున్నారని చెప్పారు. అవి నకిలీ విత్తనాలు కావటంతో ఈ ప్రాంతంలో సుమారు వంద కోట్ల రూపాయల మేరకు నష్టం ఏర్పడిందని తెలిపారు. విత్తన అమ్మకాలు, నాణ్యతపై వ్యవసాయాధికారుల పర్యవేక్షణ కొరవడటంతో నకిలీలు రాజ్యమేలుతున్నాయని విమర్శించారు. వ్యవసాయ మంత్రి స్పందించి నష్టపోయిన రైతన్నలకు విత్తన కంపెనీల నుంచి గానీ ప్రభుత్వ పరంగానైనా నష్టపరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. రెండేళ్లుగా వర్షాభావంతో ఈ ప్రాంతంలో పంటలు పండలేదని పేర్కొన్నారు. అప్పోసప్పో చేసి ఈ ఏడాది మిర్చి మొక్కలు నాటిన రైతులు కల్తీ విత్తనాలతో దారుణంగా మోసపోయారని చెప్పారు. రైతులకు న్యాయం జరిగేవరకు పోరాడతామని, అన్ని పార్టీల మద్దతుతో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన ఉద్ధృతం చేస్తామని తెలిపారు.
Advertisement
Advertisement