రుణమాఫీ మాయ
► అర్హత ఉన్నా మాఫీ కాని రుణాలు రూ.2,217 కోట్లు
► చంద్రబాబు మాయలో రైతుల చిత్తు
► నేడు గుత్తికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రతిపాటి పుల్లారావు రాక
రుణమాఫీ హామీని నమ్మి జిల్లా రైతులు నిలువునా మోసపోయారు. ఇప్పటికీ కోలుకోలేకపోతున్నారు. తీసుకున్న రుణమెంత? ఎంత మాఫీ అయ్యింది? ఎంత వడ్డీ వేశారు? ఇంకా ఎంత కట్టాలనే ప్రశ్నలకు సమాధానం దొరక్క తల పట్టుకుంటున్నారు. రుణమాఫీ గురించి జిల్లా అధికారులు, బ్యాంకర్లను అడిగినా కచ్చితమైన వివరాలు చెప్పలేని పరిస్థితి నెలకొంది.
అనంతపురం అగ్రికల్చర్: రుణమాఫీ రైతులకు అందని ద్రాక్షగా మారింది. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్, కుటుంబంలో ఒక్కరికే, గరిష్టంగా రూ.1.50 లక్షలు.. ఇలా సవాలక్ష షరతులు పెట్టడంతో అన్నదాతలు నష్టపోతున్నారు. జిల్లా మొత్తమ్మీద చూస్తే రుణమాఫీకి అర్హత ఉన్నా రూ.2,217 కోట్లు రద్దు కాలేదు. చాలామంది రైతులు మండల, జిల్లా గ్రీవెన్స్‌లు, ఏవో, ఏడీఏ, జేడీఏ కార్యాలయాలు, బ్యాంకులతో పాటు ఏకంగా హైదరాబాద్ వెళ్లి అర్జీలిచ్చినా నయాపైసా మాఫీ కాలేదు. అంతో ఇంతో మాఫీకి నోచుకున్న వారికి కూడా పూర్తిగా సొమ్ము దక్కడం లేదు.
జిల్లాలో పంట, బంగారు రుణాలు, టర్మ్‌లోన్లు, వ్యవసాయానుబంధ రంగానికి సంబంధించి రూ.6,817 కోట్లకు పైగా ఉన్నాయి. పంట, బంగారు రుణాలు మాత్రమే మాఫీకి అర్హమైనవని ప్రభుత్వం ప్రకటించింది. ఈ రెండింటి కింద రూ.4,944.44 కోట్లు ఉన్నాయి. ఈ మొత్తాన్ని రద్దు చేయాలని బ్యాంకర్లు ప్రతిపాదనలు పంపారు. కానీ రూ.2,727.94 కోట్లు మాత్రమే రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇది కూడా 20 శాతం చొప్పున మిగతా మూడేళ్లు నిధులు విడుదల చేస్తేనే సాధ్యమవుతుంది.
మొదటి విడతలో తక్షణ మాఫీ కింద రూ.1,062 కోట్లు ర ద్దయ్యాయి. ఇప్పుడు రెండో విడత కింద 20 శాతం చొప్పున మంజూరు చేసిన రూ.416 కోట్లకు సంబంధించి రుణ ఉపశమన పత్రాలను రైతులకు పంపిణీ చేస్తున్నారు. ఇందులో భాగంగా గుత్తిలో గురువారం (నేడు) నిర్వహిస్తున్న ముగింపు సమావేశానికి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హాజరవుతున్నారు. మాఫీ మాయాజాలంపై రైతులు మంత్రిని ప్రశ్నించే అవకాశా లున్నాయి.