లోక కల్యాణం కోసమే సాయి అవతరణ
పుట్టపర్తి టౌన్ : లోక కల్యాణం కోసమే సత్యసాయి అవతరించారని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు ఆర్‌జే రత్నాకర్‌రాజు అన్నారు. పట్టణంలోని పెద్దవెంకమరాజు కల్యాణ మండపంలో శనివారం సత్యసాయి పూర్వవిద్యార్థులు సాయి బోధనలు, మానవతా విలువలతో కూడిన బోధన అన్న అంశంపై ఉపాధ్యాయులు, యువతకు వర్క్‌షాప్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రత్నాకర్‌రాజు హాజరై ప్రసంగించారు. విద్యతోనే సమాజంలో వెలుగులు నింపవచ్చని నమ్మిన సత్యసాయి విలువైన విద్యను అందించేందుకు కృషి చేశారన్నారు.దేశీయంగా 105 సత్యసాయి విద్యాసంస్థలు నడుస్తున్నాయని, వీటి ద్వారా 65 వేల మందికి పైగా విద్యాబుద్ధులు పొందారన్నారు.
బాల్యం నుంచే మానవతా విలువులు, ఆధ్యాత్మికతను పెంపొందించే లక్ష్యంతో బాలవికాస్ విద్యా విధానాన్ని రూపొందించారని, దేశీయంగా బాలవికాస్ శిక్షణను మూడు లక్షల మంది విద్యార్థులు పొందుతున్నారని, 20 వేల మంది వలంటీర్లు విద్యార్థులకు శిక్షణనిస్తున్నారన్నారు. జనవరి 7, 8న ప్రశాంతి నిలయంలో బాలవికాస్ స్నాతకోత్సవం కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అనంతరం విలువలు, ఆధ్యాత్మిక, సృజనాత్మకతను పెంపొందించే పాఠ్యపుస్తకాలను వివిధ మండలాల విద్యాధికారులకు, ప్రధానోపాధ్యాయులకు రత్నాకర్‌రాజు అందజేశారు. అంతకుమునుపు సత్యసాయి పూర్వవిద్యార్థులు, యువత, ఉపాధ్యాయులు పట్టణంలో సత్యసాయి బోధనలను చాటుతూ ర్యాలీ నిర్వహించారు. పుట్టపర్తి, బుక్కపట్నం, కొత్తచెరువు తదితర మండలాల చెందిన ఉపాధ్యాయులు, యువత వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు.